Nara Lokesh : లోకేష్ సచివాలయానికి ఎందుకు రావడం లేదు.. రీజన్ ఇదేనా?

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మంత్రి అయ్యారు. అయితే ఆయన పదవీ బాధ్యతలను ఇప్పటి వరకూ చేపట్టలేదు

Update: 2024-06-20 04:30 GMT

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మంత్రి అయ్యారు. అయితే ఆయన పదవీ బాధ్యతలను ఇప్పటి వరకూ చేపట్టలేదు. సచివాలయానికి రావడం లేదు. అందరు మంత్రులు మంచి ముహూర్తం చూసుకుని తమ ఛాంబర్ లలో పదవీ బాధ్యతలను స్వీకరిస్తున్నారు. అయితే లోకేష్ మాత్రం ఇంకా పదవీ బాధ్యతలను స్వీకరించలేదు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలోనే ఉండి లోకేష్ తనకు కేటయించిన శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉండవల్లిలో ప్రతి రోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తూ లోకేష్ ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. మరి లోకేష్ ఇంత వరకూ బాధ్యతలను స్వీకరించక పోవడానికి కారణాలపై పార్టీలోనూ, ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది.

ఇప్పటికే అనేక మంది మంత్రులు...
చాలా మంది మంత్రులు పండితుల వద్దకు వెళ్లి మంచి ముహూర్తాలు చూసుకుని తమ ఛాంబర్ లోకి అడుగుపెట్టారు. పవన్ కల్యాణ్ తో పాటు ఇతర మంత్రులు కూడా బాధ్యతలను అధికారికంగా చేపట్టారు. కానీ లోకేష్ ఇంత వరకూ సచివాలయానికి రాలేదు. ముహూర్తాలు లేవా? అంటే మిగిలిన మంత్రులకు కుదిరిన ముహూర్తాలు లోకేష్ కు ఎందుకు సరిపడవన్న ప్రశ్న తలెత్తుతుంది. అదే సమయంలో లోకేష్ కు తాను అనుకున్న శాఖలే కేటాయించారు. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) శాఖలు కేటాయించారు. దీనిపై నారా లోకేశ్ వెంటనే సానుకూలంగానే స్పందించారు.
మంచి శాఖలు కేటాయింపు...
హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖల మంత్రిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన చంద్రబాబుకి ధన్యవాదాలు తెలుపుతూ నారా లోకేష్ ప్రకటన కూడా విడుదల చేశారు. శాఖల కేటాయింపులో అసంతృప్తి మాత్రం లేదనుకోవాలి. అయితే గతంలో తాను నిర్వహించిన పంచాయతీ రాజ్ శాఖ ఇప్పడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కేటాయించారు. ఆ కారణంగా చినబాబు నొచ్చుకున్నారా? అన్న చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అదే సమయంలో మరికొన్ని విషయాలపై కొంత క్లారిటీ రావాల్సి ఉండటంతో ఆయన పదవీ బాధ్యతలను చేపట్టకుండా ఆగిపోయారంటున్నారు. కానీ అది పెద్ద విషయాలేవీ కాదని, త్వరలోనే లోకేష్ సచివాలయంలో బాధ్యతలను స్వీకరిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఈ నెల 21వ తేదీన...
చంద్రబాబు కేబినెట్ లో లోకేష్ ముద్ర కూడా స్పష్టంగా కనిపించింది. ఆయన సూచించిన వారిలో కొందరికి మంత్రి పదవులు దక్కాయంటున్నారు. ఈ నెల ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు లోకేష్ ఖచ్చితంగా సచివాలయానికి రావాల్సి ఉంది. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఆయన పేరు బలం మీద మంచి ముహూర్తం లేకపోవడంతోనే పదవీ బాధ్యతలను స్వీకరించడం ఆలస్యమవుతుందని చెబుతున్నారు. త్వరలోనే ఆయన సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్ లోకి ప్రవేశిస్తారని కూడా పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. లోకేష్ సచివాలయానికి రావడం,బాధ్యతలను స్వీకరించడం త్వరలోనే జరుగుతుందని కూడా చెబుతున్నారు. సెక్రటేరియట్ ఫోర్త్ ఫ్లోర్‌లో గల ఛాంబర్‌లో ఈ నెల 21వ తేదీన బాధ్యతలను స్వీకరించనున్నారని తెలిసింది. ఛాంబర్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి రావడంతోనే ఆయన పదవీబాధ్యతలు చేపట్టడం ఆలస్యమయిందంటున్నారు. ఛాంబర్ లో పనులు జరుగుతుండటంతో ఆయన సచివాలయానికి రాలేదు. మొత్తం మీద లోకేష్ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News