తిరుమల ఆలయం మూసివేత.. భక్తులు గమనించండి

తిరుమల శ్రీవారి ఆలయాన్ని నేడు మూసివేయనున్నారు. పాక్షిక చంద్రగ్రహణం

Update: 2023-10-28 02:56 GMT

తిరుమల శ్రీవారి ఆలయాన్ని నేడు మూసివేయనున్నారు. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శనివారం రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తామని టీటీడీ తెలిపింది. అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటలకు ఆలయ తలుపులు తిరిగి తెరుచుకోనున్నాయి. పాక్షిక చంద్రగ్రహణం అక్టోబర్‌ 29న తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య పూర్తవుతుంది. గ్రహణం కారణంగా తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం కూడా మూతపడుతుంది. అక్టోబరు 28న సాయంత్రం 6 గంటలకు భవనాన్ని మూసివేసి అక్టోబరు 29న ఉదయం 9 గంటలకు తెరుస్తారని టీటీడీ తెలిపింది. ఈ 15 గంటల పాటూ అన్నప్రసాదాల పంపిణీ ఉండదు. సహస్రదీపాలంకారసేవను రద్దు చేశారు.. అలాగే వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాలను రద్దు చేసింది టీటీడీ.

పాక్షిక చంద్రగ్రహణం కారణంగా టీటీడీ స్థానిక ఆలయాలు కూడా మూతపడతాయి. సాయంత్రం టీటీడీ స్థానికాల‌యాల త‌లుపులు మూసివేసి.. ఆదివారం ఉద‌యం ఆల‌యాలు మళ్లీ తెరుస్తారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని అక్టోబ‌రు 28న సాయంత్రం 5 గంట‌ల‌కు మూసివేస్తారు. తిరిగి ఆదివారం ఉదయం 7 గంట‌ల నుంచి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నానికి అనుమతిస్తారు.తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాలు రాత్రి 7 గంట‌ల‌కు మూతపడతాయి. తిరిగి ఆదివారం తెల్ల‌వారుజామున 4.30 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరుస్తారు. ఆలయాల్లో శుద్ధి తర్వాత భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసి­వేయనున్నారు. శనివారం సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం కవాట బంధనం చేయనున్నారు. 29న తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజలు చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. 29న సుప్రభాత సేవ, వస్త్ర సేవ, ఖడ్గమాలార్చనను రద్దు చేశారు అధికారులు. శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణాలు నిర్వహిస్తారు.
శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ మధ్యాహ్నం 3.30 గంటల వరకే భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటలకు సామూహిక అభిషేకాలు, 12.30 గంటల వరకు గర్భాలయ అభిషేకాలు జరుగుతాయని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు మల్లన్న ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్లు చెప్పారు. ఉపాలయాలైన సాక్షి గణపతి, పాలధార పంచధార, శిఖరేశ్వరం ఆలయాలను కూడా మూసివేయనున్నట్లు వెల్లడించారు. 29వ తేదీ ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి, ఆలయ సంప్రోక్షణ, ప్రాతఃకాలపూజల అనంతరం 7 గంటలకు దర్శనాలు, ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయని అన్నారు.


Tags:    

Similar News