గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద టెన్షన్
గుంటూరులోని సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది
గుంటూరులోని సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ అన్యాయమంటూ సీఐడీ కార్యాలయానికి భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. అశోక్ బాబును మీడియా ముందు ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్దయెత్తున సీఐడీ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.
అశోక్ బాబు అరెస్ట్ తో....
మాజీ మంత్రి దేవినేని ఉమ నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు సీఐడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పాత కేసులను తిరగదోడి అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. అయితే ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. అశోక్ బాబును మరికొద్ది సేపట్లో న్యాయస్థానంలో ప్రవేశ పెట్టే అవకాశముంది.