CPI : నారాయణా.. మీరు ఇక మారరా? పార్టీని ఎదగనివ్వరా?
ఆంధ్రప్రదేశ్ లో సీపీఐ అనేది మరీ రాజకీయంగా వన్ సైడ్ గా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి;

ఆంధ్రప్రదేశ్ లో సీపీఐ అనేది మరీ రాజకీయంగా వన్ సైడ్ గా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి చంద్రబాబుకు మద్దతిచ్చినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీపీఐ మాత్రం చంద్రబాబు చేతిని వదిలేందుకు ఇష్టపడేలా కనిపించడం లేదు. ముఖ్యంగా సీపీఐ అగ్రనేతలు తీసుకునే నిర్ణయాలు, ఇచ్చే స్టేట్ మెంట్లు కూడా పార్టీని మరింత దిగజార్చేలా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అస్సలు చంద్రబాబు నాయుడును వదలడం ఇష్టం లేని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇంకా జగన్ మీద పడి విమర్శలు చేయడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం మానేసి ఒక పార్టీకి వత్తాసు పలకడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణలో మాత్రం...
పొరుగు రాష్ట్రంలో సీపీఐ తెలివిగా కాంగ్రెస్ తో ఎన్నికలకు ముందు పొత్తు కుదుర్చుకుంది. దేశ వ్యాప్తంగా ఇండి కూటమిలో ఉంది కాబట్టి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా ఎవరూ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. దీంతో సీపీఐకి తెలంగాణలోని శాసనసభలోనూ, శాసనమండలిలోనూ ప్రాతినిధ్యం లభించింది. సీపీఎం మాత్రం కాంగ్రెస్ కు దూరంగా ఉంది. సీపీఐ తెలంగాణలో ఒకలా, ఆంధ్రప్రదేశ్ లో మరోలా వ్యవహరిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇవ్వడంపై సీపీఐలోని కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కూడా బీజేపీకి పరోక్షంగా మద్దతిస్తున్నందున వైసీపీతోనూ దూరం పాటించాల్సి ఉంది.
జగన్ ను తిట్టడానికే...
కానీ జగన్ తిట్టడానికే సీపీఐ నారాయణకు సమయం సరిపోతుంది. వక్ఫ్ బిల్లు విషయంలో బీజేపీకి మద్దతిచ్చిన చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతివ్వడం, వ్యతిరేకించిన జగన్ ను విమర్శించడంపై నారాయణ తన పెద్దరికాన్ని కోల్పోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా నారాయణ చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. వైఎస్ జగన్ పై సీపఐ నారాయణ సెటైర్లు వేశారు. పోలీసుల బట్టలూడదీసి జగన్ ఏం చూడాలి అనుకుంటున్నాడు? అంటూ నారాయణ ప్రశ్నించడం మరో వివాదానికి తావివచ్చింది. వాళ్ల బట్టలు ఊడదీసి జగన్ ఏం చేస్తాడు? జగన్ సీఎంగా ఉన్నప్పుడు పోలీసులు ఆయనకు చప్రాసి లాగా పని చేశారన్న నారాయణ వైఎస్ జగన్ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, గతంలో జగన్ పోలీసులను వాడుకుని ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక మాజీ సీఎంని అరెస్ట్ చేయించారన్నారు. నారాయణా.. ఇలా వ్యవహరిస్తే ఉన్న పరపతిని కూడా ఏపీలో కోల్పోక తప్పదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.