Ration Rice : రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తుంది ఎవరు.. వేల కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి?
ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై పెద్దయెత్తు చర్చ జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై పెద్దయెత్తు చర్చ జరుగుతుంది. ఇంతకీ ఈ రేషన్ స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు? అన్నదానిపై అందరికీ అనుమానాలున్నాయి. కొన్నేళ్ల నుంచి ఈ తంతు జరుగుతుంది. చెప్పాలంటే గత ఐదేళ్ల నుంచి మాత్రమే కాదు.. కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈరేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు రవాణా అవుతున్నట్లు చెబుతున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన రేషన్ బియ్యం ఏపీలోని వివిధ పోర్టుల నుంచి విదేశాలకు ఎగుమతి అయిందన్నది వాస్తవం. కేవలం ఏపీ నుంచి మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బియ్యం ఇక్కడకు తీసుకు వచ్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో కనుగొన్నారు.
పట్టెడన్నం తినాలన్న...
పేదలు పట్టెడన్నం తిన్నాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యాన్ని నిరుపేదలకు అందిస్తున్నారు. రేషన్ దుకాణాల నుంచి తెలుపు రంగు కార్డు ఉన్న వారికి మాత్రమే రేషన్ బియ్యం అందిస్తారు. రాష్ట్రంలో 1.47 లక్షల మంది వరకూ రేషన్ కార్డుదారులున్నారు. వీరందరిలో కొత్తలో రేషన్ బియ్యం తాము ఇంట్లో వినియోగించుకోవడానికి తీసుకునే వారు. కానీ రాను రాను కొనుగోలు శక్తి పెరగడంతో పాటు రేషన్ బియ్యం నాసిరకమైనవిగా భావించడంతో దానిని తీసుకోవడం వృధా అన్న అభిప్రాయానికి వచ్చారు. కొందరు మాత్రంఇప్పటికీ రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నా స్వల్ప సంఖ్యలోనే అన్నది కాదనలేని వాస్తవం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కేవలం పేదలకు ఉచిత బియ్యం కోసం సంవత్సరానికి సగటున ఏడాదికి 16 వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు...
ప్రస్తుతం దాదాపు 10 వేల కోట్లు కేంద్రానికి, 6 వేల కోట్లు రాష్ట్రానికి ఉచిత బియ్యం కోసం వ్యయం అవుతుందన్నది వాస్తవం. గడచిన 5 సంవత్సరాలలో రమారమి మొత్తం 80 వేల కోట్లు ఖర్చు అయితే కేంద్ర ప్రభుత్వం 50 వేల కోట్లు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి 30 వేల కోట్లు ఖర్చు అయిందని లెక్కలు చెబుతున్నాయి.కిలో బియ్యం 43.50 రూపాయలు ఖర్చు పెట్టి సివిల్ సప్లైస్ ద్వారా పేదలకు బియ్యం రెండు రూపాయలకే ఇస్తుంటే అందులో తక్కువ మంది తీసుకుంటున్నార. మిగిలిన బియ్యం రాష్ట్రంలోని మొత్తం కోటి 47లక్షల రేషన్ కార్డు దారుల్లో మూడో వంతు మంది కూడా ఆహారంగా వాడటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రేషన్ దుకాణాల్లో మిగిలిపోయిన బియ్యాన్ని స్మగ్లర్లు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారన్నది అంతే వాస్తవం.
తక్కువ ధరకు బియ్యం కొని...
రేషన్ దుకాణాల నుంచి కిలో పది రూపాయల లెక్కన కొని వియాత్నం వంటి దేశాలకు 70 రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రత్యేకంగా కోస్తా, ఉభయగోదావరి, రాయలసీమ ప్రాంతానికి చెందిన నలుగురైదుగురు వ్యాపారుల చేతుల్లోనే ఈ దందా సాగుతున్నట్లు ప్రభుత్వ ప్రాధమిక దర్యాప్తులో వెల్లడయిందని సమాచారం.2019 - 24 మధ్య కాలంలో పేదలకు అందాల్సిన 80 వేల కోట్ల రూపాయల ఉచిత బియ్యంలో ఎక్కువ భాగం విదేశాలకు ఎగుమతి అయింది. ఇందుకు కాకినాడ పోర్టు అడ్డాగా మారింది. ఇక కరోనా వంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆకలి తీర్చాలని రెట్టింపు బియ్యం ఇస్తే దానిని కూడా విదేశాలకు తరలించారంటున్నారు. ఒక్క విశాఖ పోర్టు నుంచే పన్నెండు వేల కోట్ల రూపాయల విలువైన రేషన్ బియ్యం 70 వేల మెట్రిక్ టన్నుల ఎగుమతి అయిందని సాక్షాత్తూ నాదెండ్ల మనోహర్ తెలిపారు. మరి ఈ దశాబ్దాల కాలంలో ఎంత బియ్యం దారిమళ్లిదన్నది ఊహకందనివిషయం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నిజానిజాలను వెలుగులోకి తెచ్చిస్మగ్లర్లను జైల్లో పెట్టాలని జనం కోరుకుంటున్నారు. మరో వైపు మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం కూాడా రేషన్ బియ్యం మాయం చేసిన కేసుల్లో చిక్కుకోవడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.