Tirumala : సోమవారం నాడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. సోమవారం అయినా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు;

తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. సోమవారం అయినా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. పరీక్షల ఫలితాలు వస్తుండటంతో ఉత్తీర్ణులయిన వారితో పాటు వారి తల్లిదండ్రలు వెంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు పోటెత్తుతున్నారు. దీంతో తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. మాడ వీధులన్నీ గోవింద నామ స్మరణలతో మారుమోగిపోతున్నాయి. అదే సమయంలో తిరుమలకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
వరాహస్వామి ఆలయం వద్ద...
తిరుమల వచ్చిన భక్తులు వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే ముందు తొలుత వరాహ స్వామిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తుంది. దీంతో వరాహస్వామి వద్ద కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడంతో గంటల తరబడి దర్శనానికి సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. బేడీ ఆంజనేయ స్వామి గుడి వద్ద కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో తిరుమలలో అన్ని చోట్ల భక్తులు కిక్కిరిసి పోయి ఉండటంతో వసతి గృహాలు దొరకడం కూడా కొంత కష్టంగా మారిందని భక్తులు చెబుతున్నారు.
అన్ని కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట ఏటీజీహెచ్ వరకూ క్యూ లైన్ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 79,100 మంది భక్తుల దర్శించుకున్నారు. వీరిలో 32,791 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.52 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.