Free Bus for Women : మహిళల ఉచిత బస్సు రోడ్డుపైకి ఎక్కేది ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుపై ఇంకా క్లారిటీ రాలేదు.;

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుపై ఇంకా క్లారిటీ రాలేదు. ఉగాదికి కూడా దీనిని ప్రారంభిస్తారన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఉగాదికి ఇంకా వారం రోజులుమాత్రమే సమయం ఉంది. అయితే మహిళలకు ఉచిత బస్సు పథకానికి సంబంధించి ఇప్పటి వరకూ అధికారులు ఎలాంటి కసరత్తులు చేయడం లేదు. అంటే ఉగాది కూడా ఉచిత బస్సు అమలు అసాధ్యమేనని ఆర్టీసీకి చెందిన ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు ఇప్పటివరకూ అందలేదని చెబుతున్నారు. దీంతో ఉగాది నాటికి అమలు చేయాలనుకున్న ఈ పథకం మరోసారి వాయిదా పడుతుందన్న భావన అందరిలోనూ వ్యక్తమవుతుంది.
ఆచితూచి ముందడుగు...
గత ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన హామీని అయితే ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. చంద్రబాబు అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలుఎక్కి టిక్కెట్ అడిగితే తన పేరు చెప్పాలంటూ కూడా గట్టిగానే హామీ ఇచ్చారు. అయినా పది నెలలు అవుతున్నా ఇంత వరకూ ఈ హామీ అమలు కాకపోవడంతో మహిళలు కొంత నిరాశలో ఉన్నారు. అయితే పథకం అమలు చేసినా ఇటు ప్రభుత్వానికి అటు ఆటో కార్మికులకు నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలన్న కారణంతో ప్రభుత్వం ఈ పథకంపై ఆచితూచి అడుగులు వేస్తుంది. అందుకే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి వచ్చింది. మంత్రి వర్గ ఉప సంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
ఆశలపై నీళ్లు...
మరోవైపు రాష్ట్రమంతటా అమలు చేస్తారనుకున్న ఈపథకం కేవలం జిల్లాలకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసనమండలిలో చెప్పడంతో మహిళల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కేవలం జిల్లాల్లోనే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమయింది. కానీ అందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉన్నందున ఎప్పటికప్పుడు దీనిపై చర్చిస్తూ ఎలా దీనిని అమలు చేయాలన్న దానిపై చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్లుకనపడుతుంది. ఉగాది పండగకు అయితే మహిళకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రం అమలులోకి రానట్లే. మరి ఎప్పుడన్నది దీనిపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఏపీలో మహిళలు ఎదురు చూస్తున్నారు.