జడిపిస్తున్న జవాద్... మరో ఇరవై నాలుగు గంటల్లో...?
ఉత్తరాంధ్రకు జవాద్ తుఫాన్ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది.
ఉత్తరాంధ్రకు జవాద్ తుఫాన్ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది విశాఖకు 580 కిలోమీటర్ల దూరంలో.. ఒడిశాలోని గోపాల్ పూర్ కు 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తుఫాన్ గా మారే సూచనలు ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.
రేపు ఉదయానికి....
తీవ్ర వాయుగుండం గంటకు 32 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతూ.. శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని కన్నబాబు పేర్కొన్నారు. దీని ప్రభావంతో నేడు ఉత్తరాంధ్రలో పలుప్రాంతాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వివరించారు. తుఫాన్ ప్రభావంతో నేటి అర్థరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, శనివారం ఉదయం నుంచి 70-90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. తుఫాన్ కారణంగా భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు కూడా పంట పొలాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మూడు రోజులు....
జవాద్ గండాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున కింది అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. జీవీఎంసీ, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో మూడ్రోజుల పాటు భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో.. సహాయక చర్యల నిమిత్తం 66 మంది ఎన్డీఆర్‌ఎఫ్, 55 ఎస్డీఆర్‌ఎఫ్ సభ్యులను అలర్ట్ చేసినట్లు తెలిపారు.