Tirumala Laddu Controversy : జగన్ సరే.. టీటీడీ బోర్డు సభ్యులు ఏం చేస్తునట్లు?

తిరుమల లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. లడ్డూలో జంతువుల నూనె కలిపారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు

Update: 2024-09-22 07:35 GMT

తిరుమల లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. లడ్డూలో జంతువుల నూనె కలిపారంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. మరో వైపు ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని తాము లడ్డూ తయారీలో వినియోగించలేదని టీటీడీ ఈవో శ్యామలరావు చెబుతున్నారు. అయినా సరే వివాదానికి తెరపడటం లేదు. బీజేపీ నేతలు, టీడీపీ లీడర్లు తిరుమల లడ్డూ వివాదాన్ని మరింత పెద్దది చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి హిందూ మనోభావాలను మరింత దెబ్బతీయవద్దని భావించడం లేదు. అలాగని లడ్డూల విక్రయాలు ఏమాత్రం తగ్గలేదని టీటీడీ చేసిన ప్రకటన కూడా భక్తుల మనోభావాలకు దర్పణం పడుతుంది.

బోర్డు నిర్ణయాలే...
అయితే ఇందులో ప్రధానమైనది అసలు ఇందులో ప్రభుత్వం తప్పేముందన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. టీటీడీ స్వయంప్రతిపత్తి సంస్థ. దానికి ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు నిర్ణయాలే అమలవుతుంటాయి. ముఖ్యమంత్రి చెప్పినట్లు బోర్డు వినాలన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే బోర్డులో మన రాష్ట్రం నుంచే కాదు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా సభ్యులుగా ఉంటారు. వారందరూ ఓకే చెబితేనే ఏఆర్ డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలుకు తక్కువ ధరకు తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలు చేసిందన్న విషయం మరిచిపోతున్నారు. అందులో హేమాహేమీలున్నారు. ఇటు జనసేన పార్టీలో చేరబోతున్న మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఉన్నారు. 2
019 లో ప్రస్తుత టీడీపీ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా బోర్డు సభ్యురాలిగా ఉన్నారు.
అలాగే నాటి బీజేపీ కేంద్ర మంత్రులు సిఫార్సు చేసిన వారు కూడా సభ్యులుగా ఉన్నారు. వారందరినీ కూడా దీనిని బాధ్యులను చేస్తారా? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడం లేదు.
ఫుల్‌స్టాప్ పెట్టరా?
24 మంది సభ్యులున్న బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకే ఏఆర్ డెయిరీకి ఆ నెయ్యి కేటాయింపు జరిగిందని భావించాలి. టెండర్లలో తక్కువ ధర కోట్ చేస్తే అనుమానం రాలేదా? అన్న ప్రశ్నకు ఎవరు L1 అయితే వారికి ఇవ్వడం టెండర్లలో సంప్రదాయంగా వస్తుండం విషయం అందరికీ తెలిసిందే. కానీ నెయ్యి నాణ్యతను చెక్ చేసుకుంటామన్న ధీమాతోనే తక్కువ ధరకు వస్తుంది కదా? అని బోర్డు కూడా ఓకే చెప్పి ఉండవచ్చు. అంత మాత్రాన ఒకరిని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తూ ఎన్నాళ్లిలా లడ్డూ వివాదాన్ని సాగదీస్తారన్న ప్రశ్న చాలా మంది నుంచి వినిపిస్తుంది. చూసే వారికి, వినేవారికి ఏవగింపుగా అనిపిస్తుంది. ఇప్పటికైనా లడ్డూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రస్తుత ప్రభుత్వం అలాంటి తప్పులు జరగకుండా తగిన చర్యలను శాశ్వత ప్రాతిపదికన తీసుకుంటే మంచిదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.


Tags:    

Similar News