టిటిడి కీలక నిర్ణయం.. భారీగా పెరిగిన ఆర్జిత సేవల ధరలు

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ధరలను భారీగా పెంచింది టీటీడీ. కరోనా కారణంగా నిలిచిపోయిన ఆర్జిత సేవలను పునరుద్ధరిస్తూనే..

Update: 2022-02-17 10:51 GMT

తిరుమల కొండపై ఇకపై ప్రైవేటు హోటళ్లు కనుమరుగవ్వనున్నాయి. కొండపై ప్రైవేటు హోటళ్లను తొలగించాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. గురువారం టీటీడీ పాలకమండలి సమావేశమై.. పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో ప్రైవేటు హోటళ్లు తొలగించాలని, తిరుపతి బాలాజీ జిల్లా కలెక్టరేట్ కోసం టీటీడీ పద్మావతి నిలయం ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించారు. దైవ దర్శనానికి వచ్చేది సీఎం అయినా, సాధారణ భక్తుడైనా, వీఐపీలైనా సరే.. టీటీడీ అన్న ప్రసాదం తినాల్సిందేనని టీటీడీ స్పష్టం చేసింది.

అలాగే.. ఆలయ పనులపై దృష్టి సారించింది. శ్రీవారి ఆలయ మహాద్వారం, బంగారు వాకిలి, ఆనంద నిలయాలకు బంగారు తాపడం పనులు చేయించాలని, అన్నమయ్య మార్గం రెండు మూడు నెలల్లో మరమ్మతులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని పాలక మండలి సభ్యులు నిర్ణయించారు. అలిపిరి వద్ద ఆధ్యాత్మిక నగరం నిర్మించాలని తీర్మానించారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న శ్రీనివాస సేతు వంతెన నిర్మాణ పనులకోసం ఈ ఏడాది డిసెంబర్ లోగా రూ.150 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు.
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ధరలను భారీగా పెంచింది టీటీడీ. కరోనా కారణంగా నిలిచిపోయిన ఆర్జిత సేవలను పునరుద్ధరిస్తూనే.. వాటి ధరలను ఊహించని రీతిలో పెంచేసింది. సుప్రభాత సేవకు 120 రూపాయలు, సిఫార్సు లేఖపై 240 ఉండగా.. దాన్ని రెండు వేల రూపాయలకు పెంచింది. తోమాల అర్చన సేవకు కూడా సాధారణంగా 220, సిఫార్సు లేఖపై 440 ఉన్న ధరను ఐదు వేల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. కళ్యాణోత్సవం సేవ టికెట్‌ ధర గతంలో రూ.1000 ఉండగా.. ఆ ధరను రూ.2500కు, రూ.3000 గా ఉన్న వేద ఆశీర్వచనం టికెట్ ధరను ఏకంగా రూ.10 వేలకు పెంచుతూ టిటిటి నిర్ణయం తీసుకుంది. ఇక వస్త్రాలంకరణ సేవ టికెట్‌ ధరను రూ.50,000 నుంచి లక్షరూపాయలకు పెంచేసింది టిటిడి.


Tags:    

Similar News