పది పరీక్షల్లో ఫెయిల్.. మనస్తాపంతో ఇద్దరు విద్యార్థినులు బలవన్మరణం
శ్రీ సత్యసాయి జిల్లా నవాబుకోటకు చెందిన సుహాసిని 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయింది. మనస్తాపం చెందిన సుహాసిని..
ఏపీలో మే 6వ తేదీ ఉదయం 10 వ తరగతి పరీక్షా ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫలితాలు విడుదలయ్యాక కొందరు విద్యార్థులు తమకు మార్కులు తక్కువ వచ్చాయని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్షల ఫలితాల్లోనూ ఇదే జరిగింది. ఏపీలో ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన, మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడి కన్నవారికి తీరని కడుపుకోతను మిగిల్చారు.
శ్రీసత్యసాయి జిల్లా నవాబుకోటకు చెందిన సుహాసిని 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయింది. మనస్తాపం చెందిన సుహాసిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. నంద్యాల జిల్లా పోతులదొడ్డి గ్రామానికి చెందిన కామాక్షి లెక్కల పరీక్షలో ఫెయిల్ కావడంతో.. ఆమె కూడా ఉరిపోసుకుంది.
అనంతపురం జిల్లాలో మరో ఇద్దరూ విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రి పాలయ్యారు. ధర్మవరం మండలం పోతునాగేపల్లికి చెందిన దినేశ్ కుమార్ రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో.. విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. తల్లిదండ్రులు గమనించి వెంటే ఆస్పత్రికి తరలించారు. ఓబులాపురం గ్రామానికి చెందిన శివకుమార్ కి 434 మార్కులే రావడంతో.. మనస్తాపంతో తోటలోకి వెళ్లి విషం తాగాడు. అతను కూడా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్లీ పరీక్షలు రాసి పాస్ అవ్వొచ్చు. అంతమాత్రానికే ప్రాణాలు తీసుకుని కన్నవారికి కడుపుకోత మిగల్చకండి.