కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి కీలక పదవి
కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి కీలక పదవి...
కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి కీలక పదవి వరించింది. ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్‌గా ఆయన ఎన్నికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రెండో ఆసియా-పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామ్మోహన్‌నాయుడి పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్యదేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. దేశం తరఫున తనకు ఈ అరుదైన గౌరవం దక్కిందని, ఎంతో ఆనందంగా ఉందన్నారు రామ్మోహన్‌నాయుడు. దేశం తరఫున తనకు దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని, విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తానన్నారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బుధవారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో పౌర విమానయానానికి సంబంధించిన 2వ ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ (APMC)ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన, సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) ప్రెసిడెంట్ సాల్వటోర్ సియాచిటానో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి వుమ్లున్మాంగ్ వువాల్నమ్ పాల్గొన్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుండి 29 దేశాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.