Chandrababu : చంద్రబాబు ఆ ధైర్యం చేయగలరా? చేస్తే మాత్రం హిస్టరీ క్రియేట్ చేసినట్లే
విజయవాడ నగరం వరద ముంపులో కూరుకుపోయింది. దీనికి ఇబ్బందులు తలెత్తాయి.
విజయవాడ నగరం వరద ముంపులో కూరుకుపోయింది. దీనికి బుడమేరుకు భారీగా వరద నీరు రావడంతోనే ఈ ఇబ్బందులు తలెత్తాయి. భవనాలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకూ బాధితులు తేరుకోలేదు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదు. ప్రకాశం బ్యారేజీ నుంచి పన్నెండు లక్షల క్యూసెక్కుల నీరు విడుదల కావడం ఒక రికార్డు. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా జరిగి రాత్రికి రాత్రి బెజవాడ వాసుల తలరాతను మార్చేసింది. ఎవరూ ఊహించని విపత్తు ఇది. ఎవరూ కావాలని చేసిన... తెచ్చుకున్న కష్టం కాదది. ఎవరూ ఇలాంటి ఇబ్బందులను కోరుకోరు. పాలకులు ఎవరూ ఇలాంటి విపత్తును ఆశించరు కూడా. రెండు రోజుల్లో నలభై సెంటీమీటర్ల వర్షపాతం పడటం ఎవరైనా ఊహిస్తారా?
ఆక్రమణలను తొలగిస్తేనే?
విజయవాడ వరదలపై రాజకీయ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ ఇంతటి నష్టం జరగడానికి అసలు కారణం బుడమేరును ఆక్రమించి అడ్డుగోలుగా నిర్మించిన కట్టడాలేనని చెప్పక తప్పదు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని చెప్పడంతో మరోసారి బుడమేరు ఆక్రమణలపై చర్చ మొదలయింది. ఎప్పటి నుంచో అన్ని ప్రభుత్వాలు చూసీ చూడనట్లు వ్వవహరించడం వల్లనే ఇన్ని ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. ఆక్రమణలన్నీ రాజకీయ పార్టీల స్థానిక నేతల మద్దతుతోనే జరిగాయన్నది కాదనలేని వాస్తవం. 2005 తర్వాత ఇంతటి స్థాయిలో బుడమేరకు వరదలు రావడంతో ఆక్రమణలపై నగర వాసులు చర్చించుకుంటున్నారు.
కొల్లేరును ముంచేస్తూ...
బుడమేరు డైవర్షన్ ఛానల్ కెపాసిటీ సరిపోక పోవడంతో సింగ్ నగర్ తో పాటు విజయవాడలోని నలభై శాతం ప్రాంతం నీటిమయంగా మారింది. దాదాపు ఆరు రోజుల నుంచి నీరు వెళ్లకుండా ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ఇంతటి విపత్తుకు కారణం ఖచ్చితంగా ఆక్రమణలే. బుడమేరు కొండపల్లి, కవులూరు, శాంతినగర్, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి మీదుగా విజయవాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి బుడమేరు కొల్లేరు వరకూ వెళ్లాలి. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత బుడమేరు కాల్వ సామర్థ్యాన్ని పెంచి దానిని నేరుగా పోలవరం కుడి కాల్వకు కలపాలని ప్రయత్నించారు. ఇందుకోసం పనులు కూడా జరిగాయి. తర్వాత ప్రభుత్వం దిగిపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. బుడమేరు నుంచి వెళుతున్న నీరు ప్రస్తుతం కొల్లేరు ప్రాంతాన్ని ముంచేస్తుంది.
గత పాలకులు ప్రయత్నించినా...
బుడమేరు డైవర్సన్ ఛానల్ సామర్థ్యం కేవలం 11,500 క్యూసెక్కులు మాత్రమే అయితే దీని సామర్థాన్ని పెంచాలని అనేక మంది పాలకులు ప్రయత్నించినా అది సఫలం కాలేదు. ఈసారి ఎక్కువ స్థాయిలో నీరు విడుదల కావడంతో పాటు ఖర్మకాలి కృష్ణానదికి కూడా వరద పోటెత్తడంతో ఇంతటి విపత్తు జరిగింది. నాడు ఆక్రమణలను తొలగించాలనుకున్నప్పుడు రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించడం ఈ ముప్పునకు కారణమయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందున్న లక్ష్యం బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు పోలవరం కుడికాల్వలో కలిపే పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్దాక్షిణ్యంగా ఆక్రమణలను తొలగించగలిగితే భవిష్యత్ లో బెజవాడ ఇలాంటి విపత్తుల నుంచి బయటపడుతుంది. లేదంటే మాత్రం విజయవాడ గతిని ఎవరూ మార్చలేరు.