తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోందంటే?
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణశాఖ
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. శుక్రవారం నాడు దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురవగా.. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోసర్తు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. విపరీతంగా చలి పెరిగిపోతోంది. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరిగే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాగల రెండు, మూడు రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. గాలులు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపుకి వీస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ఏరియాల్లో చలి తీవ్రత కారణంగా ప్రజలు వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. పొగమంచు దట్టంగా అలుముకుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.