Andhra Pradesh : గుడ్ న్యూస్..నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్...పౌరసేవలు మీ చేతిలోనే
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ సేవలు ప్రారంభం కానున్నాయి. 161 సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి;

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ సేవలు ప్రారంభం కానున్నాయి. 161 సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండానే వాట్సాప్ ద్వారా పౌర సేవలను పొందే అవకాశముంది. కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సర్టిఫికేట్లను కూడా ఈ వాట్సాప్ సేవల ద్వారా పొందే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాట్సాప్ సేవలను ప్రారంభిస్తుంది. వాట్సాప్ లో తమకు కావాల్సిన సేవలను సంబంధిత అధికారికి వాట్సాప్ చేస్తే దానికి సంబంధించిన సేవలు మనకు అందుతాయి. వాటిని ప్రింట్ తీసుకుని వినియోగించుకోవచ్చు. దీనివల్ల పాలన పారదర్శకంగా ఉండటమే కాకుండా లంచాలు లేకుండా ప్రజలకు పౌర సేవలు లభిస్తాయి.
ఈ శాఖల్లో తొలి విడతగా...
వాట్సాప్ సేవలు తొలిదశలో మున్సిపల్, సీఎంఆర్ఎఫ్, అన్నా క్యాంటిన్, రెవెన్యూ, ఆర్టీసీ, విద్యుత్తు, దేవాదాయ శాఖల్లో ప్రజలకు అందనున్నాయి. అయితే వాట్సాప్ ద్వారా వెళుతున్న సమాచారాన్ని గోప్యంగా ఉంచేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. పౌరులకు చేరే సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీకి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇప్పటికే మెటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాది అక్టోబరు 22వ తేదీన ఒప్పందం కుదుర్చుకున్నా అమలులోకి రావడానికి కొంత సమయం పట్టింది. ఈరోజు నుంచి వాట్సాప్ సేవలు అందుబాటులోకి వస్తుండటం శుభపరిణామమే.
ఈరకమైన సేవలు...
ఈ వాట్సాప్ సేవల ద్వారా దేవాలయాల్లో దర్శనాల టిక్కెట్ల దగ్గర నుంచి గదుల బుకింగ్, డొనేషన్లు దాతలు ఇచ్చేందుకు కూడా వీలయ్యేలా సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. అత్యంత వేగంగా తమకు కావాల్సిన సమాచారం లభించడమే కాకుండా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ పనిచేస్తుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక అత్యధికంగా అవసరమయ్యే రెవెన్యూ శాఖలో కూడా స్టేట్ ల్యాండర్ రికార్డులతో పాటు ముఖ్యమైన సర్టిఫికేట్లు కూడా జారీ చేయనున్నారు. మున్సిపల్ శాఖలో ఆస్తిపన్నుతో పాటు జనన, మరణ ధృవీకరణ పత్రాలతో పాటు ట్రేడ్ లైసెన్సులు కూడా జారీ చేస్తారు. ఇక విద్యుత్తు శాఖ బిల్లుల చెల్లింపును కూడా దీని ద్వారా చేసే వీలుంది. నిజంగా ఇది హ్యాపీ న్యూసే కదూ?