Ys Jagan : జగన్ కు పులివెందుల భయం పట్టుకుందా?
వైసీపీ అధినేత జగన్ తరచూ పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.;

వైసీపీ అధినేత జగన్ తరచూ పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గం కావడంతో అందులో పెద్దగా విశేషమేమీ లేకపోయినా గతంలో ఎన్నడూ లేని విధంగా నెలలో నాలుగైదు సార్లు వచ్చి పులివెందులలో పర్యటిస్తూ అక్కడ ప్రజలతో మమేకమవుతూ రెండు, మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయడం చర్చనీయాంశమైంది. జగన్ పులివెందులలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ ను కూడా నిర్వహిస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ జగన్ పులివెందులకు పెద్దగా వెళ్లింది లేదు. కానీ 2024 ఎన్నికల తర్వాత మాత్రం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే పులివెందులకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారన్న అభిప్రాయం పార్టీ నేతల్లోనూ నెలకొంది.
మంచి పట్టున్నా...
వైఎస్ కుటుంబానికి కడప జిల్లాలో మంచి పట్టుంది. అందులోనూ పులివెందుల నియోజకవర్గం ఆ కుటుంబం అడ్డాగా చెప్పొచ్చు. కానీ గత ఎన్నికల్లో కడప జిల్లాలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఏడింటిలో కూటమి పార్టీలు గెలుపొందడంతో పాటు తన సోదరి వైఎస్ షర్మిల ప్రభావం, వైఎస్ వివేకానందరెడ్డి హత్య వంటి వాటితో కూడా జగన్ కొంత సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినట్లు గమనించారని చెబుతన్నారు. తన ఇలాకాలో ప్రత్యర్థులు వేళ్లూనుకునే ప్రమాదం పొంచి ఉందని భావించిన జగన్ ముందుగా ఇంటిని చక్కదిద్దుకోవాలన్న ప్రయత్నంలోనే ఉన్నట్లు కనపడుతుంది. ఎందుకుంటే పులివెందులలో మారుతున్న పరిస్థితులు కూడా తరచూ ఆయన రావడానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
సులువు కాకపోయినా...
ఎవరు అవునన్నా కాదన్నా జగన్ పై పులివెందులలో ఇమేజ్ చెరిపేయడం ప్రత్యర్థులకు అంత సులువు కాదు. కానీ టీడీపీ జగన్ ను దెబ్బతీయడానికి టార్గెట్ పులివెందుల అని స్లోగన్ అందుకుంది. మహానాడును కూడా కడప జిల్లాలో ఈ ఏడాది నిర్ణయించడం, అందులోనూ పులివెందులలో మహానాడు జరిపితే ఎలా ఉంటుందన్న దానిపై టీడీపీ అగ్రనేతలు చర్చిస్తున్నారు. పులివెందులలో మంచి స్థలం దొరికితే అక్కడే మహానాడు జరిగే అవకాశాలున్నాయి. మరో వైపు ద్వితీయ శ్రేణి నేతలను కూడా బెదిరించో, బతిమాలో తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు కూడా కూటమి పార్టీలు ప్రారంభించాయి. అందుకే జగన్ తరచూ పులివెందులలోనే పర్యటిస్తున్నారన్న టాక్ వినపడుతుంది.
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత...
చివరకు భారీ వర్షాలకు, ఈదురుగాలులకు అనంతపురం, కడప జిల్లాల్లో అరటితోటలతో పాటు పండ్లతోటలు ధ్వంసమయి రైతులు నష్టపోయారు. కానీ జగన్ మాత్రం పులివెందుల నియోజకవర్గంలోనే పర్యటించారు. జగన్ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువ సమయం బెంగళూరులోనే ఉంటున్నారు. తాడేపల్లిలో ఒకటి రెండు రోజులు మినహా నెలకు నేతలకు కూడా అందుబాటులో ఉండటం లేదు. అదే బెంగళూరు తర్వాత జగన్ ఎక్కువగా పులివెందులలోనే పర్యటిస్తుండటం కూడా క్యాడర్ లో చర్చనీయాంశంగా మారింది. పులివెందులలో పార్టీ క్యాడర్ తో పాటు నేతలను కాపాడుకోవడం ఇప్పుడు జగన్ కు కత్తిమీద సాముగా మారిందనే చెప్పాలి.