Ys Jagan : పదవులు ఇవ్వడం కాదు..వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి సోదరా?
వైఎస్ జగన్ ఇప్పుడు అనేక పదవులను భర్తీ చేశారు. పొలిటికల్ అడ్వయిజరీ కమిటీని నియమించారు.;

ప్రాంతీయ పార్టీల్లో పదవులు ఇవ్వడం ముఖ్యం కాదు. వారికి ఆ పదవుల్లో ఎంత ప్రాధాన్యత ఇచ్చారన్నదే ముఖ్యం. క్షేత్రస్థాయిలో పరిస్థితులు నేతల నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు తరచూ పార్టీ అధినేతలు వారితో సమావేశమై సలహాలు, సూచనలు తీసుకోవాలి. సూచనలు బాగుంటే అమలు చేయవచ్చు. గ్రౌండ్ లెవెల్లో వాళ్లంతా పరిస్థితులను పసిగడతారు కాబట్టి వారు నిజాలను నిర్భయంగా అధినేతకు చెప్పుకునేందుకు అవకాశమివ్వాలి. అప్పుడే వాస్తవాలు పార్టీ అగ్రనేతకు తెలుస్తాయి. వైఎస్ జగన్ ఇప్పుడు అనేక పదవులను భర్తీ చేశారు. పొలిటికల్ అడ్వయిజరీ కమిటీని నియమించారు. దాదాపు 33 మంది సీనియర్ నేతలతో దీనిని ఏర్పాటు చేశారు.
ఎందరి నినియమించినా...
అంతవరకూ బాగానే ఉంది. ఎంత ఎక్కువ మంది ఉన్నా అందరూ చెప్పే మాటలను వినే ఓపిక అధినేత జగన్ కు ఉండాలి. 33 మందిలో సీనియర్ నేతలతో పాటు అనేక సామాజికవర్గానికి చెందిన నేతలున్నారు. గతంలోనూ వాలంటీర్ల వ్యవస్థ వల్ల తాము దెబ్బతింటున్నామని, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని చెప్పేందుకు కూడా ఏ మంత్రికి కూడా జగన్ కు చెప్పే అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ జిల్లా పర్యటనకు వస్తే ఆ సాహసం చేయలేకపోయేవారు. నేను ఉన్నాను..నేను విన్నాను అన్న నినాదాన్ని పాదయాత్రలో అమలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు. అధికారులు, కోటరీపైనే ఆధారపడి రాజకీయం చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు...
ఫలితంగా గత ఎన్నికల్లో దారుణమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. కార్యకర్తలను విస్మరిస్తే ఏం జరుగుతుందో చూశారు. అలాగే ఎమ్మెల్యేలను బొమ్మలుగా మార్చి అంతా తాడేపల్లి నుంచి కథ నడిపిస్తే జరిగిందేదో ఈపాటికి జగన్ కు అర్థమయి ఉంటుంది. అధికారం కోల్పోవడంతో పాటు దారుణంగా పదకొండు సీట్లు వస్తే కానీ జగన్ కు అసలు విషయం బోధపడలేదు. వాలంటీర్ల వ్యవస్థతో జనానికి మేలు జరిగినా కార్యకర్తలతోనూ, ఎమ్మెల్యేలతోనూ ప్రజలకు పని లేకుండా పోవడంతో వారిని పట్టించుకోలేదన్న విమర్శలు ఫలితాల తర్వాత కానీ తెలియ లేదు. ఈ విషయాన్ని చెబుదామంటే ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు జగన్ వద్దకు వెళ్లనివ్వని పరిస్థితి నాడు నెలకొంది.
సీనియర్ నేతలు చెప్పే విషయాలను...
అయితే నేడు జగన్ 33 మందిని పొలిటికల్ అడ్వయిజరీ కమిటీని నియమించారు. వీరిలో ముద్రగడ పద్మనాభం, తమ్మినేని సీతారాం, కొడాలి నాని, గొల్ల బాబూరావు, అనిల్ కుమార్ యాదవ్, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నారాయణస్వామి లాంటి సీనియర్ నేతలున్నారు. వీరంతా జనంలో తిరిగే వారు. జనం నాడితో పాటు లోటుపాట్లను నిర్భయంగా జగన్ కు చెప్పగలగాలి. జగన్ కూడా వారి సూచనలను హుందాగా స్వీకరించాలి. అప్పుడే ఇంతమందిని నియమించినందుకు ఒక ఫలితం ఉంటుందని వైసీపీ నేతలే అంటున్నారు. అలా కాకుండా ఏదో పదవులు ఇచ్చామని చెప్పి వారికి కుర్చీలకే పరిమితం చేస్తే మాత్రం పరిస్థితుల్లో మార్పులు రావడం కష్టమేనన్నది జగన్ తెలుసుకోవాలి.