Ys Jagan : జగన్ ఫిక్స్ అయిపోయినట్లుందిగా...ఏందీ కాన్ఫిడెన్స్?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఒంటరి పోరు చేస్తున్నారు. ఈసారి గెలుపు తనదేనన్నధీమాతో ఉన్నారు;

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఒంటరి పోరు చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకూ విజయాన్ని అందిస్తుందన్నది పక్కన పెడితే జగన్ ఆత్మవిశ్వాసానికి మాత్రం మంచి మార్కులు వేయాల్సిందే. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి జగన్ తీసుకున్న రాజకీయ నిర్ణయాలే ఆయనను ప్రజల్లో హీరోగా నిలిచేలా చేశాయన్న దానిలో నిజముంది. సోనియా గాంధీ అంతటి నేతనే ఎదిరించి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టడం అంటే ఆషామాషీ కాదు. అంతేకాదు పదహారు నెలలు జైలులో ఉండటానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. జగన్ కు సుఖాలు ఎంత తెలుసో? కష్టాలు అదేస్థాయిలో అనుభవించిన నేతగా ప్రజల్లో పేరుపొందారు. కష్టాలను కూడా చిరునవ్వుతో స్వీకరించడం జగన్ స్పెషాలిటీ.
వచ్చే ఎన్నికల్లో...
ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తిరిగి తామే మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ పదే పదే చెబుతూ క్యాడర్ లో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ప్రదర్శించే ధైర్య సాహసాలే ఆయనకు ఎక్కువ మంది అభిమానులను తెచ్చిపెట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినిమా హీరో కు ఉన్నంత క్రేజ్ జగన్ కు ఉండటం, జగన్ బయటకు వస్తే వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి రావడం అసాధారణమైన విషయమే. అధికారంలో ఉన్నప్పుడంటే జనసమీకరణ చేశారని అనుకోవచ్చు. ఓటమి తర్వాత రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా జగన్ ను ఊపిరి తీసుకోనివ్వకుండా కార్యకర్తలు చుట్టుముడుతున్నారంటే జగన్ బలం ఏంటో వేరే చెప్పాల్సిన పనిలేదు.
రెండు పార్టీలకే...
అందుకే ప్రత్యర్థులు ఎవరూ జగన్ ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయరు. వేయలేరు కూడా. ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన రాజకీయ పరిస్థితులున్నాయి. అయితే టీడీపీ లేదంటే వైసీపీ అధికారంలోకి రావాల్సిందే. ఈ రెండు పార్టీలకు మరో ప్రత్యామ్నాయం లేదు. ఓటు బ్యాంకు విషయంలోనూ వైసీపీకి బలం మామూలుగా లేదు. క్షేత్రస్థాయిలో బలమైన పార్టీగా ఎదిగిన వైసీపీకి గత ఎన్నికల్లోనూ దారుణంగా ఓటమి చవి చూసినా నలభై శాతం ఓట్లు వచ్చాయంటే సామాన్య విషయమేమీ కాదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. సీట్ల నెంబర్లలో తేడా ఉండవచ్చేమో కానీ, మూడు పార్టీలు కలిస్తే వచ్చిన ఓట్లలో జగన్ పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చాయంటే ఎక్కువ మంది జనం జగన్ అభిమానిస్తున్నట్లే లెక్కేసుకుని మరీ ప్రస్తుత పాలకులు వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుంది.
మార్పు సహజమే...
సహజంగా ఎన్ని మంచి పనులుచేసినా, జనం మార్పు కోరుకుంటారు. జగన్ కూడా బహుశా అదే అంచనాలో ఉన్నట్లుంది. అందుకే చాలా కాన్ఫిడెంట్ గా వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని చెబుతున్నారు. అదే సమయంలో ఇకపై తాను జనంలోనే ఉంటానని కూడా హామీ ఇస్తున్నారు. జగన్ నిజంగా జనంలోకి వస్తే పార్టీకి మరింత హైప్ రావడం ఖాయమన్న అంచనాలు వినపడుతున్నాయి. మరోవైపు వైసీపీ నేతలు వరస అరెస్ట్ లు కూడా పార్టీకి కొద్దో గొప్పో సానుభూతిని తెచ్చిపెడతాయి తప్పించి, నష్టం మాత్రం చేకూర్చవన్న నమ్మకంతో ఫ్యాన్ పార్టీ నేతలున్నారు. మొత్తం మీద ఏతా వాతా జగన్ మాత్రం తదుపరి ముఖ్యమంత్రిని తానేనని ఫిక్స్ అయినట్లే కనపడుతుంది. మరి ప్రజల తీర్పు రావడానికి మరోనాలుగేళ్ల సమయం ఉంది. ఈలోగా ఎన్ని మార్పులు జరుగుతాయన్నది వేచి చూడాలి.