ఈవీఎంలపై నెట్టినా...
ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడే జగన్ ఈవీఎంల మీద నెపం నెట్టారు. ఈవీఎంల ద్వారా మ్యాజిక్ చేయకపోతే కూటమికి అంత భారీ స్థాయిలో విజయం దక్కేది కాదని, అదే సమయంలో తమకు కూడా అంత తక్కువ సంఖ్యలో సీట్లు వచ్చేవి కావని నమ్ముతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించడం వెనక ఈవీఎంలే కారణమని చెబుతున్నారు. అనేక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో జమిలి ఎన్నికలు వచ్చినప్పటికీ ఈసారి కూడా తనకు విజయం దక్కే అవకాశాలు ఎంత వరకూ ఉన్నాయన్న దానిపై అనేక అనుమానాలు వైసీపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. కూటమి బలంగా ఉండటంతో పాటు బీజేపీతో కలసి ఉండటంతో వచ్చే ఎన్నికల్లోనూ అధికారానికి దూరంగా ఉంటామని భావిస్తున్నారు.
కీలక నేతలు వెళ్లిపోయినా...
అది గ్రహించి వైసీపీ నుంచి కీలక నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారన్నది కూడా జగన్ దృష్టికి వచ్చిందట. కూటమిని వచ్చే ఎన్నికల్లోనూ ఎదుర్కొనడం కష్టమని భావించిన నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. జగన్ కు ఇప్పుడు బీజేపీ నేరుగా సాయం అందించే పరిస్థితుల్లో మాత్రం లేదు. అధికారంలో లేకపోవడంతో పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ నుంచి మద్దతు పుష్కలంగా ఉండటంతో జగన్ ను పార్టీ కేంద్ర నాయకత్వం కూడా పట్టించుకోవడం మానేసిందంటున్నారు. అంతేకాకుండా జగన్ పార్టీ వల్ల బీజేపీకి పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపయోగం ఏమీ లేనందున జగన్ ను దూరం పెట్టారంటున్నారు. ఢిల్లీలో వైసీపీకి చెందిన నేతలు చేసిన సయోధ్య ప్రయత్నాలు కూడా ఫలించలేదని చెబుతున్నారు.
లాబీయింగ్ దారులు...
ఈ క్రమంలోనే ఈ గండం నుంచి బయటపెడేదెలా? అన్నది జగన్ కు అర్థం కాకుండా ఉంది. కీలక నేతలు వెళ్లిపోయినా క్యాడర్ లో నుంచి లీడర్లను ఎంపిక చేస్తున్నప్పటికీ వారు ఎంత వరకూ విజయం దిశగా పయనిస్తారన్నది పెద్దడౌటు. పర్చూరు నియోజకవర్గంలో గాదె కుటుంబానికి మళ్లీ టిక్కెట్ ఇవ్వడం కూడా ఇందులో భాగమేనంటున్నారు. అదే సమయంలో ఇటు గెలుపుపై అనుమానాలు, అటు కేసులు చుట్టుముడతాయన్న సమాచారంతో జగన్ కొంత ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. లాబీయింగ్ చేసేందుకు కూడా జగన్ కు దారులు మూసుకుపోయాయని, ఈ తరుణంలో మరోసారి ఓటమి పాలయితే ఇక పార్టీని చాపచుట్టేయాల్సిందేనంటున్నారు. అదే జగన్ బెంగ.. అసలు భయమన్నది పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న విషయం.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now