Ys Jagan : జగనూ.. ఇప్పటికైనా అర్థమయిందా? ఎవరు నీవారో.. ఎవరు పరాయి వారో?

వైఎస్ జగన్ ఎన్నికల ఫలితాల నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు

Update: 2024-07-18 07:56 GMT

వైఎస్ జగన్ ఎన్నికల ఫలితాల నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. తాను చేసిన తప్పులతో పాటు ఎవరెవరిని చేరదీశానన్నది ఆయనకు క్రమంగా అర్థమవుతుంది. జగన్ యువనేత. యువనాయకులకు అవకాశం ఇవ్వాలి. పాతతరం నేతలకు సామాజికవర్గం సాకుగా చూసి పదవులు ఇస్తే వాళ్లలో ఒక్కరూ ఉండరు. ఓటమి వరకే వారు వెంట ఉంటారు. ఓటమి తర్వాత పత్తా లేకుండా పోతారు. ఎందుకంటే వారికి పార్టీ ప్రయోజనాలకన్నా, జగన్ పదవులు ఇచ్చారన్న కృతజ్ఞతకన్నా వేరే మార్గాలుంటాయి. వారికి కావాల్సింది అధికారం. అందుకే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎప్పటికీ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వకూడదు.

బాబును చూసయినా...?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇన్నేళ్లకు ఆయనకు అసలు విషయం అర్థమయింది. అందుకే మొన్నటి ఎన్నికల్లో సీనియర్లకు అక్కడకక్కడా మొహమాట పడి టిక్కెట్లు ఇచ్చినప్పటికీ వారిని ఇక పార్టీకి గుదిబండలా మార్చదలచుకోలేదు. సీనియర్ నేతలను నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టి యువకులకు ప్రాధాన్యత ఇచ్చారు. తొలిసారి గెలిచిన అనేక మంది మంత్రి పదవులు పొందారు. ఆ ఒక్కటి చాలు వాళ్లు పార్టీకి నమ్మకంగా ఉండటానికి. కానీ సీనియర్లకు ఇవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. అందుకే ఎవరేమనుకున్నా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. వాళ్ల వల్ల పార్టీకి ఉపయోగం లేదన్న నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
మాజీ మంత్రులు ఎక్కడ?
ఇక జగన్ పరిస్థితి కూడా అంతే. ఓటమి తర్వాత నలుగురైదుగురు నేతలు తప్ప ఎవరూ పెద్దగా బయటకు రావడం లేదు. జగన్ మంత్రి వర్గంలో కీలకంగా వ్యవహరించిన మంత్రులు ఎవరూ అందుబాటులో లేకుండా పోయారు. కనీసం క్యాడర్ కు కూడా వారు చిక్కకుండా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఓటమి ఇంత ఊహించినంత నిరాశను నేతల్లో తెచ్చి పెడుతుందని జగన్ కూడా భావించలేదు. జగన్ నేతలతో సమావేశమవుతున్నా పెద్దగా ఒకరోఇద్దరో వచ్చి అలా వెళ్లడం తప్ప పూర్తి స్థాయిలో పార్టీకోసం పనిచేసే వారు కనిపించకుండా పోయారు. అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్‌నాథ్ వంటి వారు మినహా మిగిలిన నేతలు ఏపీ బోర్డర్ ను దాటేసి పోయారని చెబుతున్నారు.
జగన్ కూడా...
జగన్ కూడా తాను కూడా ఏపీలో ఉండకుండా బెంగళూరులో ఎక్కువ సమయం ఉంటుండటం కూడా యధా రాజా.. తధా నాయకా అన్నట్లు వ్యవహారం తయారయింది. నియోజకవర్గాల్లో ఇప్పటికే క్యాడర్ ఆశతో ఎదురు చూస్తున్నారు. తమపై నమోదవుతున్న కేసులతో పాటు తమకు భరోసా ఇచ్చే నేత ఎవరన్న ప్రశ్న వారి నుంచి ఎదురవుతుంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు వెంటనే జిల్లాల పర్యటనలు చేపట్టి క్యాడర్ లో కొంత ధైర్యాన్ని నింపగలిగారు. కానీ జగన్ మాత్రం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్లీ అధికారంలో ఉన్నట్లుగానే నేటికీ వ్యవహరిస్తుండటం పార్టీ క్యాడర్ లో చర్చనీయాంశమవుతుంది. ఇప్పటికైనా జగన్ ఓటమి బాధ నుంచి వీలయినంత త్వరగా బయటపడి జనంలోకి రావాలని క్యాడర్ బలంగా కోరుకుంటుంది.


Tags:    

Similar News