YSRCP : అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే జగన్ కీలక సమావేశం.. ఎందుకంటే?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 19వ తేదీన పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 19వ తేదీన పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన 175 నియోజకవర్గాల్లోని అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆయన ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమీక్ష నిర్వహించిన జగన్ 19వ తేదీన నేతలందరితో సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవడంతో పాటు భవిష‌్యత్ ప్రణాళికను కూడా రూపొందించుకునే అవకాశాలున్నాయి. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రజల ముందుకు వెళ్లాలని నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
కార్యకర్తలకు అండగా...
అలాగే నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఈ ఐదేళ్లు పార్టీ బలోపేతానికి పాటుపడాలని నేతలకు సూచించనున్నారు. తాను కూడా త్వరలో టీడీపీ కార్యకర్తల దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తానని, క్యాడర్ కు భరోసా గా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అయితే అదే రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే జగన్ ఆరోజే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శాసనసభ సమావేశాలకు హాజరై పార్టీ కార్యాలయంలో సమావేశానికి వస్తారా? లేక శాసనసభ సమావేశాలకు డుమ్మా కొడతారా? అన్నది తెలియాల్సి ఉంది.