హామీలు ఇవ్వలేక...
వైఎస్ జగన్ బెంగళూరులో ఉంటూ అప్పుడప్పుడు తాడేపల్లికి వచ్చిజిల్లా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలకు తన మనసులో మాటను చెబుతున్నారు. చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు తమకు వరాలుగా మారతాయని అంటున్నారేకానీ, గత ప్రభుత్వంలో తాము ఏం తప్పులు చేసిందీ? ఆ తప్పులు మరోసారి పునరావృతం కానివ్వమన్న హామీని మాత్రం జగన్ నేతలకు ఇవ్వలేకపోతున్నారు. సంక్షేమ పథకాల విషయాలు సరే. ఇక మద్యం వంటి కీలకమైన అంశాలపై తన విధానాన్ని పునస్సమీక్షించుకుంటానని చెప్పడం లేదు. పైగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీలో లోపాలను ఎత్తి చూపుతున్నారు. అంటే తాను అమలు చేసిన విధానమే సరైనదని జగన్ ఇప్పటికీ భావిస్తున్నట్లే కనపడుతుంది.
అభివృద్ధి విషయంలో...
సీనియర్ నేతలు కూడా గత ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కావడానికి మద్యంపాలసీ కారణమని చెబుతున్నా జగన్ చెవికి ఎక్కినట్లు కన్పించడం లేదు. తాను ఉన్నానని, విన్నానని నాడు అన్న జగన్ ఇప్పుడు వినకుండా తన పంథాయే సరైనదన్న నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తుంది. కేవలం మద్యం ఒక్కటే కాదు మూడు రాజధానుల అంశంతో పాటు పారిశ్రామిక పెట్టుబడులు, అభివృద్ధికి సంబంధించిన అజెండా లేకపోవడం వంటివి గత ఎన్నికల్లో జగన్ ఓటమికి ముఖ్యకారణాలుగా చెబుతున్నారు. కరోనా సమయంలో కొంత పేదలకు, ప్రజలకు అండగా నిలిచారన్న పేరున్నప్పటికీ మిగిలిన విషయాల్లో మాత్రం జగన్ కు మైనస్ మార్కులే పడుతున్నాయి.
జిల్లాల పర్యటనలకు...
అదే సమయంలో పోలవరం విషయంలోనూ జగన్ ప్రభుత్వం నాడు చూపిన అలక్ష్యం ప్రజల్లో ఆయన నాయకత్వం పట్ల నమ్మకం లేకుండా పోయింది. దీంతో పాటు ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేయడం కూడా జగన్ కు రాజకీయ ఇబ్బందులు తలెత్తాయి. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్నా ప్రభుత్వం హామీలు అమలు చేయకపోయినా అధికారపార్టీ అభివృద్ధిపై చేస్తున్న హడావిడి కొంత వారికే ప్లస్ అయ్యేటట్లు ఉంది. అందుకే జగన్ వెంట నడిచేందుకు కూడా నేతల నుంచి క్యాడర్ కూడా సిద్ధంగా లేరనట్లే కనిపిస్తుంది. వచ్చే నెల మూడవ వారం నుంచి జగన్ చేపడుతున్న జిల్లాల పర్యటనలో ఫ్యాన్ పార్టీ క్యాడర్ మాత్రం ఒకింత దూరంగానే ఉంటారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఆరు నెలలకే తమను రోడ్ల మీదకు రావాలని పిలుపునివ్వడం కూడా సరికాదన్న వ్యాఖ్యలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. మరి జగన్ పర్యటనలు ఎంత మేరకు సక్సెస్ అవుతాయన్నది చూడాల్సి ఉంది.