సిట్టింగ్‌లకు టిక్కెట్లు రాకపోవచ్చు
సిట్టింగ్‌లకు కొందరికి టిక్కెట్లు దక్కకపోవచ్చని వైసీీపీ అధినేత జగన్ అన్నారు
సిట్టింగ్‌లకు కొందరికి టిక్కెట్లు దక్కకపోవచ్చని వైసీీపీ అధినేత జగన్ అన్నారు. టిక్కెట్ దక్కని వారికి మరో అవకాశం కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై జరిగిన సమీక్షలో ఈ వ్యాఖ్యలు చేశారు. టిక్కెట్ ఇవ్వకపోతే తన మనిషి కాకపోడని అన్నారు. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కో ఆర్డినేటర్లు, పార్టీ రీజనల్ ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు. అనేక నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయని వాటిని పరిష్కరించుకుని ఐక్యతగా ముందుకు వెళ్లాలని జగన్ నేతలను ఆదేశించారు. అందరు కలసి కట్టుగా పనిచేయాలని కోరారు.
ఐక్యంగా పనిచేస్తే...
అందరూ ఐక్యంగా పనిచేస్తే 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు గెలుచుకోవడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. ఇప్పటి వరకూ ఒక ఎత్తు.. రాబోయే ఆరు నెలలూ మరొక ఎత్తు అని అన్నారు. ఈ ఆరు నెలలు ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలని కోరారు. ఆరు నెలలు పనిచేస్తే మళ్లీ మనదే అధికారమని జగన్ తెలిపారు. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులున్నాయన్న జగన్ విపక్ష పార్టీలు ఒంటరిగా పోటీ చేయలేక పొత్తుల కోసం వెళుతున్నాయని ఎద్దేవా చేశారు. అందరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని జగన్ నేతలకు చెప్పారు.
అందరూ నావారే...
చాలా మందికి టిక్కెట్లు రావచ్చు. కొందరికి రాకపోవచ్చు. తన నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. వచ్చే రెండు నెలల్లో జగనన్న సురక్ష కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఎవరెన్ని చెప్పినా వైసీపీ గెలుపు ఖాయమన్న జగన్ అలాగని నిర్లక్ష్యం చేయవద్దని హితవు పలికారు. ఈ ఆరు నెలలు జనంలోనే ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడాలని కోరారు. మనం గేర్ మార్చాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు. ఈ సందర్భంగా పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వబోనని జగన్ ప్రకటించడం ఎమ్మెల్యేల్లో కలవరం మొదలయింది. అయితే టిక్కెట్లు దక్కని వారు ఎవరన్నది మాత్రం బయటకు ఈ సమావేశంలో చెప్పలేదు.