కేవీరావును తీసుకొచ్చింది చంద్రబాబే
కేవీ రావును కాకినాడ పోర్టుకు 1997లో తీసుకు వచ్చింది చంద్రబాబు అని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు
కేవీ రావును కాకినాడ పోర్టుకు 1997లో తీసుకు వచ్చింది చంద్రబాబు అని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. కేవీరావుకు అన్యాయం జరిగితే నాలుగేళ్లుగా ఏం చేస్తున్నారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయలేక రోజుకో సమస్యను తెచ్చి ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. తన కులానికి సంబంధించిన కేవీరావుకు కాకినాడ పోర్టును అప్పగించింది చంద్రబాబా? కాదా? చెప్పాలని ఆయన టీడీపీ నేతలను నిలదీశారు.
పరువు నష్టం దావా వేస్తా...
వచ్చేవారం తాను చంద్రబాబు, కేవీరావులపై హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. జగన్ పై కక్ష తీర్చుకోవడానికే కాకినాడ పోర్టు అంశాన్ని బయటకు తీసుకు వచ్చారన్నారు. తనను స్కిల్ డెవలెప్ మెంట్ స్కాం లో అరెస్టయినందుకు దానికి ప్రతిగా జగన్ ను కూడా జైలులో పెట్టాలన్న యోచనలోనే చంద్రబాబు ఉన్నారన్నారు. చంద్రబాబుది క్రిమినల్ మైండ్ అని, ఆయన లాగా అందరూ ఉంటారని భావిస్తే ఎలాగని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం రోజుకొక విషయంపై రాద్ధాంతం చేస్తుందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.