Ys Vijayamma : వైఎస్ విజయమ్మ.. కనీసం జగన్ కు ఫోన్ చేసే ప్రయత్నం కూడా చేయలేదట.. రీజన్ ఇదేనా?
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ దారుణ ఓటమి చవి చూసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమయింది.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి చవి చూసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమయింది. వైఎస్ జగన్ నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకూ ఈ షాక్ నుంచి కోలుకోలేదు. అస్సలు ఊహించని ఫలితాలు ఇవన్నది వారి అభిప్రాయం. గతంలో వచ్చిన సీట్లు రాకపోయినా కనీసం 90 నుంచి వంద స్థానాలు వస్తాయని చాలా మంది అంచనాలు వేశారు. వైసీపీలోని ప్రముఖులు కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. అపజయాన్ని అస్సలు ఊహించలేదు. అలాగే ఇంత తక్కువ స్థానాలు వస్తాయని ఎవరి మనసుల్లోనూ రాలేదంటే అంత విశ్వాసంతో ఉన్నారందరూ. కానీ ఊహించని ఫలితాల నుంచి ఎవరూ ఇంకా తేరుకోలేకపోతున్నారు.
కనీసం ఫోన్...
ఇదే సమయంలో వైఎస్ జగన్ ఓటమితో కుమారుడిని ఓదార్చే ప్రయత్నం కూడా విజయమ్మ చేసే ప్రయత్నం చేయలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి తన కుమారుడు ఓటమితో కుంగిపోతాడని భావించి విజయమ్మ తాడేపల్లి నివాసానికి రావాలి. కానీ ఆమె రాకపోగా కనీసం ఫోన్ చేసి ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. జగన్ తో మాట్లాడే ధైర్యం లేకనే విజయమ్మ ఫోన్ చేయడానికి కూడా ప్రయత్నించలేదన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ సమయంలో ఏం మాట్లాడి ఎలా ఓదార్చోలో కూడా తెలియని విజయమ్మ ఆ దిశగా ప్రయత్నం చేయలేదని చెబుతున్నారు.
ప్రత్యేకమైన ఎన్నికలు...
ఈ ఎన్నికలు జగన్ కు ప్రత్యేకం. రాజకీయంగా అంటే అందరూ ఒకటవుతారని ముందే తెలుసు. కూటమి ఏర్పాటవుతుందని, తనను వ్యతిరేకించే శక్తులన్నీ ఏకమవుతాయని కూడా ఊహించిందే. సామాజికపరంగా కూడా ఓట్లు కోల్పోవాల్సి ఉంటుందని జగన్ కు తెలియంది కాదు. అయితే తాను నమ్ముకున్న కులాలు తనను గట్టెక్కిస్తాయని మాత్రం భావించారు. అందుకే అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. అదే సమయంలో కుటుంబ సభ్యులు ఎన్నికల సమయంలో తనకు ఇలా ఇబ్బందిగా మారతారని మాత్రం ఊహించలేదు. కేవలం వైఎస్ సునీత ఒక్కరే తనకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశముందని భావించారు. అయితే వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు అవుతుందని కూడా ఊహించని విషయమే. కేసీఆర్ ను పరామర్శించేందుకు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా తల్లి విజయమ్మతో కాంగ్రెస్ లోకి షర్మిల వెళ్లకుండా చివరి ప్రయత్నం చేశారంటారు. కానీ ఆమె వెళ్లి అన్నపైనే తిరుగుబాటు జెండా ఎగురవేసింది.
అమెరికా వెళ్లిపోవడంతో...
ఇదే సమయంలో తన తల్లి విజయమ్మ అయినా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుందని ఊహించారు. తనకు అనుకూలంగా కుటుంబంలోని ఒకరు అంటే తల్లి విజయమ్మ వస్తే చాలునని భావించారు. కానీ ఆమె కుమారుడు, కుమార్తె మధ్య రాజకీయంగా నలిగిపోలేక అమెరికాలోని మనవడి వద్దకు వెళ్లిపోయారు. అప్పుడే జగన్ కొంత అసహనం వ్యక్తం చేశారంటారు. అమెరికా వెళ్లిన వైఎస్ విజయమ్మ తనను వదిలేసి వైఎస్ షర్మిలను కడప పార్లమెంటు నియోజకవర్గంలో గెలిపించాలని వీడియో విడుదల చేసిన తర్వాత ఇక జగన్ తట్టుకోలేకపోయారని అంటున్నారు. అందుకే వైఎస్ విజయమ్మ తాను అవసరమైన సమయంలో జగన్ పక్కన లేననే భావనతో, ఓటమి చెందారన్న బాధ ఉన్నప్పటికీ ఫోన్ చేసి మాట్లాడలేకపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద జగన్ ఈ ఓటమితో ఇప్పట్లో వైఎస్ కుటుంబంలోని ఇద్దరు కలిసే అవకాశాలు లేవన్నది అందరూ చెబుతున్న మాట. అయితే అన్నా చెల్లెళ్లు కాబట్టి, రక్తసంబంధం ఎప్పటికైనా కలుపుతుందన్నది వైఎస్ అభిమానుల ఆకాంక్ష.