Ys Jagan : డ్రీమ్స్ మీవి.. స్కీమ్స్ నావి.. అదే వైసీపీ లక్ష్యం
పేదలు కనే కలలను పథకాల ద్వారా నెరవేర్చడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని వైఎస్ జగన్ అన్నారు
పేదలు కనే కలలను పథకాల ద్వారా నెరవేర్చడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని వైఎస్ జగన్ అన్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన మేమంతా సభలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో ఎన్ని స్కీములు ఈ ప్రభుత్వం తీసుకు వచ్చిందో తెలుసా? అని ప్రశ్నించారు. పేదల కలల్లోనుంచి పుట్టింది వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ వడ్డీ పధకం అని అన్నారు. ప్రజలకు మంచి చేసే జగన్ పై తోడేళ్లు దాడికి దిగుతున్నాయన్నారు. లంచాలు, వివక్షతకు తావు లేకుండా నేరుగా 2.75 లక్షల కోట్ల రూపాయలను అక్క చెల్లెమ్మల బ్యాంకు అకౌంట్లలో వేశామన్నారు. చంద్రముఖి చంద్రబాబుకు ఒకరు పరోక్షంగా మరొకరు ప్రత్యక్షంగా మద్దతిస్తున్నారన్నారు.
నమ్మించి మోసం చేసి...
ఎన్నికలప్పుడు జనాలను నమ్మించి మోసం చేసింది ఈ కూటమి అంటూ ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడ్డారు. ఏరోజూ చంద్రబాబు హయాంలో ఇలాంటి స్కీమ్ లు ఎందుకు లేవని అడుగుతున్నానని అన్నారు. పేద ప్రజల మంచి గురించి చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. నారా సైన్యానికి బుద్ధి చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు వెనక దత్తపుత్రుడు ఉన్నాడని, నేరుగా బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్ చంద్రబాబుకు మద్దతిస్తున్నాయని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో దాదాపు నలభై పథకాలను పేదలకు అందించామని తెలిపారు. మీ డ్రీమ్స్ ను నా స్కీమ్ తో నెరవేర్చానని చెప్పుకొచ్చారు.
మార్పును చూసి...
గ్రామాల్లో జరిగిన మార్పు ను చూడాలని జగన్ కోరారు. గతంలో ఎప్పుడైనా ఈ మార్పును మీరు చూశారా? అని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అన్నీ ఇంటికే అందించిన చరిత్ర ఒక్క జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా అన్నీ ఇంటి వద్దకే అందిస్తూ అవ్వాతాతలకు ఇబ్బందిలేకుండా చేశామన్నారు. విద్య, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చామని చెప్పారు. రైతులకు అన్ని రకాలుగా ఆదుకుని, వారు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకుండా చూడగలిగామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించామని చెప్పారు. అవినీతికి తావులేకుండా పథకాలను ఇచ్చామని చెప్పుకొచ్చారు.