Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీని నాలుగున్నర గంటలుగా విచారిస్తున్న పోలీసులు... జైలు శిక్ష ఎన్నేళ్లు పడుతుందంటే?
వైసీపీ నేత వల్లభనేని వంశీని గత నాలుగున్నర గంటలుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు;

వైసీపీ నేత వల్లభనేని వంశీని గత నాలుగు గంటలుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు. తెల్లవారు జామున హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు రోడ్డు మార్గాన తరలించారు. ముందు భవానీపురం పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చి అక్కడ మరో వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి వల్లభనేని వంశీని ఈ కేసులో పోలీసులు విచారిస్తూనే ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపైనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. అంతే తప్ప ఈ అరెస్ట్ కు గన్నవరం టీడీపీ కార్యాలయంలపై దాడి కేసుకు సంబంధం లేదని తెలిపారు.
కేసులివే...
వల్లభనేని వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. 140 (1), 308, 351 (3), రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ 71వ నిందితుడిగా ఉన్నారు. అయితే పోలీసులు గత నాలుగు గంటలుగా సత్యవర్థన్ కిడ్నాప్ పైనే ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. కోర్టులో అఫడవిట్ ను విత్ డ్రా చేసుకోవడం వెనక ఆయనను బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలోనే ప్రశ్నిస్తున్నారు. పది లక్షల రూపాయల నగదును కూడా సత్యవర్థన్ కు ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరో ఐదుగురిపైన కూడా కేసులు నమోదు చేశారు.
నాన్ బెయిల్ బుల్...
వల్లభనేని వంశీపై పెట్టిన కేసులు నాన్ బెయిల్ బుల్ వి ఉండటంతో ఆయనకు బెయిల్ వచ్చే అవకాశాలు ఇప్పట్లో లేవని న్యాయనిపుణులు చెబుతున్నారు. విశాఖలో ఉన్న సత్యవర్థన్ ను కూడా విజయవాడకు తీసుకు వచ్చి పటమట పోలీస్ స్టేషన్ లో విచారణ జరుపుతున్నారు. సత్యవర్థన్ స్టేట్ మెంట్ ను కూడా రికార్డు చేస్తున్నారు. పకడ్బందీగా పోలీసులు ఈ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అయితే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో ఇప్పటి వరకూ తమకు చెప్పలేదని వంశీ సతీమణి తెలిపారు. పోలీసులు ఇప్పటి వరకూ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని భార్య పంకజ శ్రీ అన్నారు. అయితే విచారణ ముగిసిన తర్వాత వల్లభనేని వంశీని వైద్య పరీక్షలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపర్చనున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ విధించార.