భారత్-పాక్ ఆసియా కప్ మ్యాచ్.. థ్రిల్లర్ లో విన్నర్ గా నిలిచిన భారత్

అంతకు ముందు టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్

Update: 2022-08-29 03:09 GMT

చాలా రోజుల తర్వాత భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఎట్టకేలకు ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన పోరులో హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ షో తో భారత్ కు విజయాన్ని అందించి.. అభిమానులను ఖుషీ చేశాడు. ఈ విజయంతో భారత్ ఆసియా కప్ లో శుభారంభం చేసింది. భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 148 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో ఛేదించింది. హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జడేజా 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 35 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 35 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 18 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా జోడీ రాణించడంతో భారత్ విజయాన్ని అందుకుంది. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 7 పరుగులు అవసరం కాగా, నవాజ్ బౌలింగ్ లో తొలి బంతికే జడేజా అవుటయ్యాడు. హార్దిక్ పాండ్యా సిక్స్ తో మ్యాచ్ ను ముగించాడు. పాక్ బౌలర్లలో నసీమ్ షా 2, మహ్మద్ నవాజ్ 3 వికెట్లు తీశారు.

అంతకు ముందు టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్ సింగ్ 2, అవేష్ ఖాన్ 1 వికెట్ దక్కించుకున్నారు. పాక్ జట్టులో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇఫ్తికార్ అహ్మద్ 28 పరుగులు సాధించాడు. కెప్టెన్ బాబర్ అజామ్ (10), ఫకార్ జమాన్ (10), కుష్దిల్ షా (2) విఫలమయ్యారు. చివర్లో దహాని (6 బంతుల్లో 16), హరీస్ రవూఫ్ (7 బంతుల్లో 13 నాటౌట్) ధాటిగా ఆడడంతో పాకిస్థాన్ జట్టులో ఊపు వచ్చింది. ఇక భారత్ ఆసియా కప్ లో తన తదుపరి మ్యాచ్ ను ఈ నెల 31న హాంకాంగ్ జట్టుతో ఆడనుంది.


Tags:    

Similar News