క్రెడిట్ కార్డ్ పరిమితి ఎలా నిర్ణయిస్తారు?.. బిల్లింగ్‌ విధానం ఎలా ఉంటుంది?

క్రెడిట్ కార్డ్ అనేది స్వల్పకాలిక క్రెడిట్‌ను అందిస్తుంది. అంటే మీ అకౌంట్ ఎలాంటి డబ్బులు లేకున్నా మీ కార్డ్‌కు కేటాయించిన..

Update: 2023-09-08 05:52 GMT

క్రెడిట్ కార్డ్ అనేది స్వల్పకాలిక క్రెడిట్‌ను అందిస్తుంది. అంటే మీ అకౌంట్ ఎలాంటి డబ్బులు లేకున్నా మీ కార్డ్‌కు కేటాయించిన క్రెడిట్ పరిమితిని ఉపయోగించుకునేందుకు అనుమతి ఇస్తాయి ఆయా బ్యాంకులు. అయితే, ఇది ఒక రకమైన లోన్ అని కూడా అనుకోవచ్చు. మీరు దానిని తిరిగి చెల్లించవలసి ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలా చేయడంలో విఫలమైతే మీరు వాడిన మొత్తంపై భారీగా వడ్డీలు.. ఛార్జీలు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

బిల్లింగ్ సైకిల్ ఎలా ఉంటుంది..?

ప్రతి క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ ఉంటుంది. మరి ఈ బిల్లు సైకిల్‌ ఎలా ఉంటుందనే విషయం తెలుసుకుందాం. ఈ సైకిల్ పీరియడ్ లోనే కార్డ్ బిల్లు రెడీ అవుతుంది. మీరు కార్డ్‌తో చేసిన అన్ని లావాదేవీలు మీ తదుపరి నెల స్టేట్‌మెంట్‌లో చేర్చడానికి ఉండే సమయం. ఉదాహరణకు మీ కార్డ్ స్టేట్‌మెంట్ ప్రతి నెల 5వ తేదీన జనరేట్ అయితే, మీరు ఫిబ్రవరి 6వ తేదీన కొన్ని లావాదేవీలు చేశారనుకుందాం.. ఆ లావాదేవీలన్నీ మార్చి 5 వ తేదీన జనరేట్ అయ్యే బిల్లు స్టేట్‌మెంట్‌లో కనిపిస్తాయి. బిల్లింగ్ సైకిల్ సాధారణంగా 30 లేదా 31 రోజుల పాటు కొనసాగుతుంది.
బిల్లులను చెల్లించడానికి ఇంటరెస్ట్ లెస్ టైమ్ ఉంటుంది కాబట్టి అందరూ క్రెడిట్ కార్డ్‌లను ఇష్టపడతారు. వడ్డీ రహిత కాలం అంటే క్రెడిట్ కార్డ్ కంపెనీ కార్డు ద్వారా చేసే ఖర్చులపై ఎలాంటి వడ్డీని వసూలు చేయదు. ఈ గడువు సాధారణంగా బిల్లు జనరేట్‌ అయిన తేదీ నుంచి 21- 25 రోజుల వరకు ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఫిబ్రవరి 6న కార్డ్‌పై కొనుగోలు చేస్తే, ఎలాంటి వడ్డీ లేకుండా బిల్లును చెల్లించడానికి మీకు మార్చి 27 లేదా మార్చి 31 వరకు గడువు ఉంటుంది. ఈ 27 లేదా 31 మార్చి మీ చెల్లింపు గడువు తేదీ అవుతుంది. చెల్లింపు గడువు తేదీకి ముందే మీ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపును చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించడం చాలా అవసరం. మీరు ఈ తేదీని మిస్ అయితే, మీరు లేట్ పేమెంట్ ఫీజ్ అలాగే ఇతర ఛార్జీలను చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా మీ క్రెడిట్ కార్డ్‌పై సకాలంలో చెల్లింపులు చేయకుంటే భారీ వడ్డీ పడుతుందని గుర్తించుకోండి. చాలా మంది చేసే తప్పులు ఇక్కడే. నిర్లక్ష్యం చేస్తే మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన పరిస్థితి ఉంటుందని గట్టిగా గుర్తించుకోండి. ఒక వేళ గడువులోగా బిల్లు చెల్లించకుంటే నెలకు 3% నుంచి 4% వరకు వడ్డీ రేటును కూడా విధించవచ్చు. ఇది సంవత్సరానికి 36% నుంచి 48%కి సమానం.

బిల్లులో ఉండే నిబంధనలు ఏమిటి..?

కాగా, బిల్లులో కొన్ని నిబంధనలు ఉంటాయి. 'మొత్తం బకాయి' అనేది స్టేట్‌మెంట్ జనరేషన్ తేదీ నాటికి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని సూచిస్తుంది. ఇది ఆ తేదీ వరకు ఉన్న అన్ని బాకీలు కలిగి ఉంటుంది. మరోవైపు, 'మినిమమ్‌ బ్యాలెన్స్‌' చెల్లించడం అనేది మీ క్రెడిట్ కార్డ్ అకౌంట్‌ను నిర్వహించేందుకు మీ చెల్లింపు గడువు తేదీలో లేదా అంతకు ముందు మీరు చేయగలిగే కనీస చెల్లింపు. ఈ మొత్తం సాధారణంగా మీ మొత్తం బకాయి బ్యాలెన్స్‌లో తక్కువ అమౌంట్‌ ఉంటుంది. సాధారణంగా దాదాపు 5%. అయితే, మీరు చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని దీని అర్థం కాదు. మీరు అలా చేస్తే, మీరు ఇప్పటికీ మిగిలిన బ్యాలెన్స్‌పై వడ్డీని చెల్లించాలి. మీరు మొత్తం బిల్లు చెల్లించకుండా మినిమమ్‌ బ్యాలెన్స్‌ చెల్లించినా ఇబ్బందుల్లో పడిపోతారు. కనీస బకాయిని చెల్లించేందుకు ఎప్పుడు కూడా ముందుకు రావద్దు. ఇలా చేసినా మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది.
మీకు ఇచ్చిన క్రెడిట్ పరిమితి నుంచి మీరు ఖర్చు చేసే మొత్తం మొదట తీసి వేస్తారు. ఆపై మునుపటి లావాదేవీల నుంచి వచ్చిన వడ్డీతో పాటుగా మిగిలిన బ్యాలెన్స్ మరింత తగ్గిస్తారు. ఫలితంగా వచ్చే మొత్తాన్ని 'అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితి' అంటారు. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డ్‌కు 1 లక్ష రూపాయల పరిమితి ఉంది. మీరు 25,000 రూపాయలు ఖర్చు చేశారని అనుకుందాం. మిగిలిన బ్యాలెన్స్ 75,000 రూపాయలు, కానీ మునుపటి బిల్లుల నుంచి 4,000 రూపాయల వడ్డీ ఉంటే, అప్పుడు మీ అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితి 71,000 రూపాయలుగా ఉంటుంది.

ఏటీఎం నుంచి విత్‌డ్రా అస్సలు చేయవద్దు

ఇంకో విషయం ఏంటంటే మీ క్రెడిట్‌కార్డులో ఉన్న బ్యాలెన్స్‌ కాకుండా ఏటీఎం నుంచి తీసుకునేందుకు కొంత మొత్తాన్ని కేటాయిస్తాయి బ్యాంకులు. అంటే ATMని ఉపయోగించి విత్‌డ్రా చేయగల మొత్తం అన్నట్లు. చాలా బ్యాంకులు లేదా కార్డ్ కంపెనీలు మొత్తం క్రెడిట్ పరిమితిలో 20% నుంచి 40% వరకు నగదు పరిమితిని అందిస్తాయి. ఉదాహరణకు, మీ కార్డ్ పరిమితి 1 లక్ష రూపాయలు అయితే, మీరు ATM నుంచి 20,000 నుండి 40,000 రూపాయల వరకు నగదు తీసుకోవచ్చు. కానీ ఈ పని అస్సలు చేయవద్దు. ఎందుకంటే ఏటీఎం నుంచి తీసుకున్న మొత్తాన్ని భారీ ఎత్తున వడ్డీ విధిస్తుంది. దీని వల్ల కూడా మీరు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఏదీ ఏమైనా మీరు క్రెడిట్‌ కార్డును వాడుతున్నట్లయితే దాని గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. అప్పుడే వాడటం ప్రారంభించండి. కార్డు వాడటంలో కూడా చిట్కాలు తెలిసి ఉండాలి. లేకపోతే మీరు తీవ్రంగా అప్పుల బారిన పడే ప్రమాదం ఉందని గుర్తించుకోండి.
Tags:    

Similar News