పాన్‌కార్డుకు ఎక్స్‌పైరీ తేదీ ఉంటుందా?

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) కార్డు ఇప్పుడు వివిధ ఆర్థిక కార్యకలాపాలకు అవసరమైన పత్రం, గుర్తింపునకు కీలకమైన రుజువుగా..

Update: 2023-09-12 05:52 GMT

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) కార్డు ఇప్పుడు వివిధ ఆర్థిక కార్యకలాపాలకు అవసరమైన పత్రం, గుర్తింపునకు కీలకమైన రుజువుగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం, బ్యాంక్ లావాదేవీలకు తప్పకుండా పాన్‌ కార్డు అవసరం. ఇది లేనిది ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించలేదు. బ్యాంకు ఖాతా ఓపెన్‌ చేయడం నుంచి డీమ్యాట్ ఖాతాలు వంటి పనుల కోసం ఇది అవసరం. అయితే పాన్ కార్డ్ గడువు తీరిపోతుందా? లేదా? పునరుద్ధరణ అవసరమా? అనే అనుమానాలు చాలా మందికి తలెత్తుతుంటాయి. అయితే ఒకసారి పాన్ కార్డ్ కలిగి ఉంటే అది జీవితాంతం చెల్లుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం లేదని, కార్డు హోల్డర్ మరణించిన తర్వాత మాత్రమే పాన్ కార్డ్ రద్దు చేసే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. అందుకే ఒకసారి జారీ చేసిన పాన్ కార్డ్ మీ జీవితాంతం చెల్లుబాటు అవుతుంది.

మోసగాళ్ల పట్ల జాగ్రత్త

పాన్‌ కార్డ్‌ల గడువు ముగియడం గురించి సోషల్ మీడియాలో లేనిపోని పుకార్లు వైరల్‌ అవుతున్నాయి. తరచుగా ప్రజలను మోసగించే లక్ష్యంతో ఇలాంటి పుకార్లు వైరల్‌ అవుతున్నాయి. వారు కాల్‌లు లేదా మెసేజ్‌ల ద్వారా మీ పాన్ కార్డ్‌ని పునరుద్ధరించేలా మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. అందుకే పాన్‌కార్డు విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రెండు పాన్‌ కార్డులు ఉంటే ఏమవుతుంది?

ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139 ఏ ప్రకారం ఒక వ్యక్తి ఒక పాన్ కార్డ్‌ను మాత్రమే కలిగి ఉండాలి. మీ పేరుపై ఇప్పటికే పాన్ కార్డ్ జారీ చేస్తే మీరు కొత్త దాని కోసం దరఖాస్తు చేయలేరు. అలా చేయడం సెక్షన్ 139ఏని ఉల్లంఘించినట్లు అవుతుంది. ఒకవేళ మీ వద్ద రెండు పాన్‌ కార్డులు ఉన్నట్లయితే వెంటనే దానిని రద్దు చేయించుకోవాలి. లేకుండా మీరు సమస్యల్లో చిక్కుకున్నట్లయితే జరిమానాతో పాటు మీపై కేసు నమోదు అవుతుంది. దీని ద్వారా మీరు జైలుకు వెళ్లే పరిస్థితి కూడా రావచ్చు. సంబంధిత అథారిటీ ద్వారా రూ. 10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
Tags:    

Similar News