Gold Price Today : ఈరోజు కూడా పెరిగిన బంగారం ధరలు.. మళ్లీ ఎనభై వేలకు చేరువలో?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత నాలుగు రోజుల నుంచి వరసగా రోజూ పెరుగుతూ వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. బంగారం, వెండి ధరలు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కొన్ని రోజులు తగ్గుముఖం పట్టాయి. ఇక బంగారం ధరలు అందుబాటులోకి వస్తాయని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నాలుగు రోజుల నుంచి వరసగా ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. వెండి కూడా కిలో లక్ష రూపాయలు దాటేసింది. పది గ్రాముల బంగారం ధర ఎనభై వేలకు చేరువలో ఉంది. అంటే ఇక సీజన్ ముగియలేదు కాబట్టి బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినిపడుతున్నాయి.
ఈ సీజన్ లో...
సహజంగా నవంబరు, డిసెంబరు నెలల్లో బంగారం ధరలు పెరుగుతాయి. ఈ సీజన్ లో శుభకార్యాలు ఉండటమే కాకుండా కొత్త ఏడాదికి బంగారాన్ని కొనుగోలు చేయడం ఒక అలవాటుగా కొందరు మార్చుకున్నారు. దీపావళికి డౌన్ అయిన కొనుగోళ్లు ఇప్పటి వరకూ తేరుకోలేదు. ధరలు అమాంతం పెరగడంతో బంగారంపై ఆసక్తి చాలా వరకూ తగ్గిపోయింది. పెట్టుబడిదారులు కూడా ఒకింత వెనుకంజ వేస్తున్నారు. తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చన్న ఆలోచనతో మదుపరులున్నారు. అందుకే జ్యుయలరీ దుకాణాలు తరుగులోనూ తగ్గింపు ధరలు ప్రకటిస్తున్నాయి. దీంతో పాటు అనేక ఆకర్షణీయమైన డిజైన్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
వెండి ధర మాత్రం...
అయినా సరే బంగారం కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లు ఇరవై శాతం వరకూ తగ్గినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ధరలు పెరుగుతూ పోతుంటే ఇంకా కొనుగోళ్లు మందగిస్తాయన్న అంచనాలను కూడా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరగగా, కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,260 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,830 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,00,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.