రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నారు. డ్రంకెన్ డ్రైవర్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపం, ఇలా ఒకటేమిటి ఎన్నో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ రోడ్డు ప్రమాదాలు చేసే వారు ఎందరో ఉన్నారు. అయితే ఇలాంటి వారిపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. ఇంకా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. అయితే ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే చలాన్ పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఒక్కసారి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి చలాన్ పడితే ఆ రోజంతా చలాన్ విధించరేనది చాలా మంది భావన. ఆ రోజంతా ఇష్టానుసారంగా తిరగొచ్చు అంటూ అనుకునే వారు చాలా మంది ఉంటారు. అయితే అలాంటి వారికి ట్రాఫిక్ నిబంధనలు తెలిసి ఉండవు. చలాన్లకు సంబంధించిన ఈ నిజం తెలిస్తే మాత్రం ఇంకెప్పుడు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడరు. అంతేకాదు చలాన్ల నుంచి తిప్పించుకునేందుకు అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఏదైనా కారు/బైక్ పై రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు చలాన్ వేసే అవకాశం ఉంటుందా? అనే అనుమానం చాలా మందిలో తలెత్తుతుంటుంది.
ఒకసారి చలాన్ వేస్తే మరోసారి వేయరా..?
రోజుకు ఒకసారి చలాన్ చేసిన తర్వాత రెండోసారి ఛాలాన్ వేయరని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. అది మీరు చేసే పొరపాట్లపై, ఉల్లంఘనలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. రోజులో ట్రాఫిక్ నిబంధనలు పదేపదే ఉల్లంఘించినా కొన్ని సందర్భాలలో ఒకసారి మాత్రమే చలాన్ వేసినా.. మరికొన్ని సందర్భాలలో మళ్లీ వేసే అవకాశాలు ఉంటాయంటున్నారు. ఉదాహరణకు.. మీరు రోజులో ఒకసారి ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే జరిమానా వేస్తారు. అదే రోజు మళ్లీ అదే ఉల్లంఘనకు పాల్పడితే.. చలాన్ జారీ చేయకపోవచ్చు. అయితే ఇది కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉంటుంది. ఏదైనా నియమాన్ని పదే పదే ఉల్లంఘిస్తే.. ఒక్కసారి మాత్రమే కాకుండా.. మరో చలాన్ కూడా విధించే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
హెల్మెట్ లేకుండా బైక్, స్కూటర్‌పై ప్రయాణించడం ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన కిందకు వస్తుంది. అయితే, హెల్మెట్ కోసం మళ్లీ ఇంటికి వెళ్లలేరు కాబట్టి.. ఆ రోజుకు ఒక్క చలాన్‌తో సరిపెడతారు అధికారులు. అయితే అదే రోజు హెల్మెట్ ఉల్లంఘన కాకుండా.. మరే ఇతర పొరపాటు చేసినా జరిమానా వేస్తారు ట్రాఫిక్ అధికారులు.
ఇ-చలాన్ నిబంధనలు ఏమిటి..?
నిబంధనలను ఉల్లంఘించిన ప్రతిసారీ.. అంటే ఓవర్ స్పీడ్, రెడ్ లైట్ క్రాసింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడితే.. వెంటనే చలాన్ జారీ చేయడం జరుగుతుందంటున్నారు అధికారులు. ఒక్కసారి చలాన్ జారీ చేసిన తర్వాత రెండోసారి జారీ చేయరని అంతా భావిస్తారు. కానీ, అందులో నిజం లేదని సూచిస్తున్నారు. రోజులో ఒకసారి చలాన్ పడినా.. అదే రోజు మళ్లీ మళ్లీ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే సందర్భాలను బట్టి జరిమానా వేయడం తప్పదని ట్రాఫిక్ పోలీసు అధికారులు చెబుతున్నారు. అందుకే రోజులో ఒకసారి ట్రాఫిక్ నిబంధనలకు పాల్పడి చలాన్ పడితే.. ఆ రోజు మళ్లీ ట్రాఫిక్ చలన్ వేయరని భావించవద్దు.