రెచ్చిపోయిన దుండగులు.. 12 హిందూ ఆలయాలపై దాడి
ఉత్తర ఠాకూర్ గావ్ జిల్లాలోని బలియాడంగీ ఉప జిల్లా పరిధిలోని దంతాల, పరియా, చరుల్ యూనియన్ల పరిధిలో ఈ ఆలయాలున్నట్టు..
బంగ్లాదేశ్ లో దుండగులు రెచ్చిపోయారు. ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్ లో.. 12 హిందూ ఆలయాలపై దాడి చేసి 14 దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేశారు. పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. ఉత్తర ఠాకూర్ గావ్ జిల్లాలోని బలియాడంగీ ఉప జిల్లా పరిధిలోని దంతాల, పరియా, చరుల్ యూనియన్ల పరిధిలో ఈ ఆలయాలున్నట్టు పోలీసులు తెలిపారు. ఆలయాలు రోడ్డుకు పక్కనే ఉండటంతో దుండగులు సులంభంగా దాడిచేయగలిగారని పోలీసులు పేర్కొన్నారు. ఆలయాలపై దాడులన్నీ గతరాత్రి (ఫిబ్రవరి 5) జరిగినట్టు తెలిపారు.
ధ్వంసమైన ఆలయాలను డిప్యూటీ పోలీస్ కమిషనర్, ఎస్పీ పరిశీలించారు. అనంతరం స్థానిక హిందూ నేతలతో మాట్లాడుతూ.. ప్రస్తుతం జరిగిన ఘటనలపై భయపడాల్సిన అవసరం లేదని, హిందూ ఆలయాలకు మరింత భద్రత కల్పిస్తామని.. హామీ ఇచ్చారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వివరించారు. కాగా.. ఆలయాలపై దాడి ఘటన సమాచారం అందుకోగానే.. ఘటనా స్థలాలను చరుల్ యూనియన్ పరిషత్ చైర్మన్ దిలీప్ కుమార్ పరిశీలించి.. స్థానిక అధికారులకు సమాచారమిచ్చారు. విగ్రహాల విధ్వంసాలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.