నరబలి పేరుతో.. ఇద్దరు మహిళల దారుణ హత్య
రషీద్ మాటలను గుడ్డిగా నమ్మిన ఆ దంపతులు..గత జూన్‌లో రోస్లి అనే మహిళను కిడ్నాప్ చేసి, తమ ఇంట్లోనే పూజలు చేసి..
నరబలి పేరుతో ఇద్దరు మహిళల్ని గొంతుకోసి దారుణంగా హతమార్చిన దారుణ ఘటన కేరళలో వెలుగుచూసింది. నరబలి ఇస్తే అధిక సంపద వస్తుందన్న ఆశతో భార్య భర్తలిద్దరూ ఈ దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ, కోచి పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలంతూర్ అనే గ్రామానికి చెందిన భగవంత్ సింగ్ - లైలా దంపతులకు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో.. వారికి రషీద్ అలియాస్.. ముహమ్మద్ షఫీ అనే ఒక ఏజెంట్ తగిలాడు. నరబలి ఇస్తే వాళ్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మించాడు. ఇద్దరు మహిళల్ని నరబలి ఇవ్వాలని సూచించాడు.
రషీద్ మాటలను గుడ్డిగా నమ్మిన ఆ దంపతులు..గత జూన్‌లో రోస్లి అనే మహిళను కిడ్నాప్ చేసి, తమ ఇంట్లోనే పూజలు చేసి.. నరబలి పేరుతో ఆమె గొంతుకోసి హత్య చేశారు. సెప్టెంబర్‌లో పద్మ అనే మరో మహిళను కిడ్నాప్ చేశారు. హత్యల అనంతరం వారి మృతదేహాల్ని ముక్కలు ముక్కలు చేసి పాతిపెట్టారు. రోస్లీ, పద్మ ల కుటుంబ సభ్యులు పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఇద్దరి విషయంలోనూ కిడ్నాప్ కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు జరిపారు. ఈ కేసును లోతుగా విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. మహిళలను నరబలి పేరుతో హతమార్చిన దంపతులతను, వారికి సలహా ఇచ్చి సహకరించిన ఏజెంట్ రషీద్ ను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.