భారత్ - పాక్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ కలకలం
తాజాగా మరోసారి ఇండో - పాక్ సరిహద్దుల్లో భారత భూభాగంలోకి డ్రోన్లను పంపిన ఘటన వెలుగుచూసింది. పంజాబ్ లోని ..
పంజాబ్ : ప్రస్తుతం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్.. సరిహద్దుల్లో తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఇండో - పాక్ సరిహద్దుల్లో భారత భూభాగంలోకి డ్రోన్లను పంపిన ఘటన వెలుగుచూసింది. పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలోని బోర్డర్ అవుట్ పోస్ట్ రోసా వద్ద భారత్- పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అర్థరాత్రి డ్రోన్ల కదలిక కనిపించింది. వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమై కాల్పులు జరపడంతో డ్రోన్ వెనుదిరిగి పాక్ సరిహద్దుకు వెళ్లిపోయింది.
ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. కాల్పులతో పాటు, సరిహద్దులో నియమించే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది లైట్లు వెదజల్లే షెల్లు బాంబులను కూడా కాల్చారు. ఈ హఠాత్ పరిణామంతో సరిహద్దులో భద్రతను పెంచినట్లు అధికారులు తెలిపారు. గతనెలలోనూ పఠాన్ కోట్ లోని అంతర్జాతీయ సరిహద్దులో డ్రోన్ కనిపించడంతో బీఎస్ఎఫ్ సిబ్బంది దానిని తరిమికొట్టారు.