ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, ముగ్గురు మృతి
ప్రాథమిక సమాచారం ప్రకారం.. జమ్మూ-పఠాన్‌కోట్ హైవేపై నానకే చౌక్ వద్ద వేగంగా వెళ్తున్న బస్సును మరో బస్సు ఓవర్ ..
జమ్మూ కశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ, ఆమె కుమార్తె సహా ముగ్గురు మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. జమ్మూ-పఠాన్‌కోట్ హైవేపై నానకే చౌక్ వద్ద వేగంగా వెళ్తున్న బస్సును మరో బస్సు ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక బస్సు సహరన్‌పూర్‌కు వెళ్తుండగా, మరొకటి కథువా జిల్లాకు వెళ్తోంది. మృతులను పంజాబ్‌లోని బటాలాకు చెందిన మంగి దేవి (36), ఆమె 14 ఏళ్ల కుమార్తె తానియా, రాజ్‌పూర్‌కు చెందిన కస్తూరి లాల్ (58)గా గుర్తించారు.
కాగా.. సాంబా జిల్లా యంత్రాంగం మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.లక్ష, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.10,000 ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ ప్రమాదంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలంటూ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశిస్తూ.. ట్వీట్ చేశారు.