ఏపీలో దారుణం.. బాలికపై 6 నెలలుగా కానిస్టేబుల్ అత్యాచారం
రమేశ్ చిత్రహింసలు భరించలేని బాలిక తనతల్లిదండ్రులకు విషయం చెప్పగా.. వాళ్లు డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో..;
మహిళలు, ఆడపిల్లలపై జరుగుతున్న దారుణాలను అరికట్టాల్సిన పోలీసులే.. వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ బాలికపై ఆరునెలలుగా కానిస్టేబుల్ అత్యాచారం చేయడమే కాకుండా.. ఆమెకు అబార్షన్ చేయించిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగుచూసింది. రమేశ్ చిత్రహింసలు భరించలేని బాలిక తనతల్లిదండ్రులకు విషయం చెప్పగా.. వాళ్లు డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతానికి చెందిన రమేశ్, అతని భార్య కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వీరికి ఒక పాప ఉంది. దంపతులిద్దరూ ఉద్యోగాలకు వెళ్తుండటంతో.. కూతురిని చూసుకునేందుకు ఓ బాలికను పనిలో పెట్టుకున్నారు.
ఈ క్రమంలో రమేశ్ కన్ను ఆ బాలికపై పడింది. భార్య విధులకు వెళ్లినపుడు బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను శారీరకంగా లొంగదీసుకున్న రమేశ్.. 6 నెలలుగా బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో మూడు నెలల క్రితం అబార్షన్ కూడా చేయించాడు. ఎవరికైనా ఈ విషయం చెబితే చంపేస్తానని బెదిరించడమే కాకుండా.. లాఠీతో కొడుతూ చిత్రహింసలకు గురిచేసేవాడని బాలిక తల్లిదండ్రులు డీఎస్పీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానిస్టేబుల్ రమేష్ పై పోక్సో కేసు నమోదు చేసి, అతడిని రిమాండుకు పంపారు.