కోయంబత్తూరు రేంజ్ డీఐజీ ఆత్మహత్య.. ఇదే కారణమా ?
కోయంబత్తూరులోని క్యాంపు ఆఫీసులో ఈ ఘటన జరిగింది. ఉదయం జాగింగ్ కు వెళ్లిన విజయ్ కుమార్.. రేస్ కోర్సులో ఉన్న క్యాంపు..
కోయంబత్తూరు రేంజ్ డీఐజీ సి.విజయ్ కుమార్ శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన విజయ్ కుమార్.. తన గన్ మెన్ పిస్తోల్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కోయంబత్తూరులోని క్యాంపు ఆఫీసులో ఈ ఘటన జరిగింది. ఉదయం జాగింగ్ కు వెళ్లిన విజయ్ కుమార్.. రేస్ కోర్సులో ఉన్న క్యాంపు ఆఫీసుకు వచ్చిన తర్వాత.. 6.50 గంటల సమయంలో తనను తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీనియర్ అధికారి వెల్లడించారు. అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలపై స్పష్టత లేదన్నారు. మరోవైపు జాతీయ మీడియాలో రాజకీయ ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని కథనాలు వెలువడ్డాయి.
డీఐజీ విజయ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. కోయంబత్తూరు రేంజ్ డీఐజీ ఆఫీసర్ గా విజయ్ కుమార్ ఈ ఏడాది జనవరి 6వ తేదీన విజయ్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన అన్నానగర్ డీసీపీగా చేశారు. డీఐజీ విజయ్‌కుమార్ మృతి పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ షాక్ వ్యక్తం చేశారు. డీఐజీ రేంజ్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకోవడం.. రాష్ట్ర పోలీస్ శాఖకు తీవ్ర నష్టాన్ని, విషాదాన్ని మిగిల్చిందని ఆయన పేర్కొన్నారు. డీఐజీ కుటుంబసభ్యులకు సీఎం స్టాలిన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.