ఐశ్వర్యరాయ్ కు షాక్.. ఆ కేసులో సమన్లు జారీచేసిన ఈడీ
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్, బచ్చన్ కుటుంబ కోడలైన ఐశ్వర్యరాయ్ బచ్చన్ కు భారీ షాక్ తగిలింది. అప్పట్లో సంచలనం సృష్టించిన పనామా
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్, బచ్చన్ కుటుంబ కోడలైన ఐశ్వర్యరాయ్ బచ్చన్ కు భారీ షాక్ తగిలింది. అప్పట్లో సంచలనం సృష్టించిన పనామా పేపర్స్ లీకేజీ కేసులో ఐశ్వర్యకు కేంద్ర సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం సమన్లు జారీ చేసింది. భారత్ లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పన్ను ఎగ్గొట్టేందుకు ఎలాంటి అవకతవకలకు పాల్పడ్డారు , మనీ లాండరింగ్ వంటి వ్యవహారాలను బట్టబయలు చేసింది పనామా పేపర్స్ లీక్. ఈ లీక్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించగా.. వాటిలో ఇండియా నుంచి సుమారు 500 మంది పేర్లున్నట్లు తేలింది. పనామా లీక్స్ అనంతరం మనీలాండరింగ్ సహా వివిధ రూపాల్లో ఆర్థిక లొసుగులు జరిగినట్లు అనుమానిస్తూ ఈడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
ఈ క్రమంలోనే ఐశ్వర్యరాయ్ కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా జారీ అయిన ఈ నోటీసుల్లో ఈరోజే (డిసెంబర్ 20) ఢిల్లీలోని లోక్ నాయక్ భవన్ లో ఐశ్వర్య తమ ఎదుట హాజరుకావాలని ఈడీ ఆదేశించినట్లు సమాచారం. కానీ విచారణకు హాజరయ్యేందుకు ఐశ్వర్య మరింత సమయాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. గతంలో మనీలాండరింగ్ వ్యవహారమై అభిషేక్ కు సమన్లు జారీ చేయగా.. ఆయన అధికారుల ముందు హాజరై విచారణకు సహకరించారు. తదుపరి విచారణలో భాగంగానే ఐశ్వర్యకు సమన్లు జారీ అయ్యాయి. ఈడీ విచారణకు ఐశ్వర్య ఎప్పుడు హాజరవుతుందో తెలియాల్సి ఉంది.