నాగరాజు హత్యకేసులో పురోగతి : హత్య చేసింది ఆ ఇద్దరే !

ఫైండ్ మై డివైస్ ఆధారంగా నాగరాజు-ఆశ్రిన్ లు ఎక్కడున్నారో తెలుసుకున్నాడు. నాగరాజు కదలికలను గమనిస్తూ..

Update: 2022-05-17 13:03 GMT

హైదరాబాద్ : సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే4వ తేదీన జరిగిన నాగరాజు (పరువుహత్య) హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నాగరాజును హత్యచేసింది ఇద్దరు మాత్రమేనని దర్యాప్తులో తేల్చారు. నాగరాజు ఫోన్ లొకేషన్ ఆధారంగా వారున్న ప్రాంతంలో మాటు వేసి హత్యచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆశ్రిన్ ఇంట్లో ఇష్టం లేకుండా మతాంతర వివాహం చేసుకోవడమే ఈ హత్యకు ప్రధాన కారణమని తెలిసిందే.

ఆశ్రిన్ అన్నయ్య మొబిన్ జీమెయిల్ కు పాస్ వర్డ్ గా ఫోన్ నంబర్ ను పెట్టుకున్నాడు. నాగరాజు కూడా తన మొబైల్ నంబర్ నే పాస్ వర్డ్ గా పెట్టుకుని ఉంటాడని భావించిన మొబిన్.. అతని జీమెయిల్ ను లాగిన్ చేశాడు. అది ఓపెన్ అవ్వడంతో ఫైండ్ మై డివైస్ ఆధారంగా నాగరాజు-ఆశ్రిన్ లు ఎక్కడున్నారో తెలుసుకున్నాడు. నాగరాజు కదలికలను గమనిస్తూ.. మే 4వ తేదీన పథకం ప్రకారం మొబిన్, అహ్మద్ లు కలిసి నాగరాజును హత్య చేశారు. హత్యానంతరం ఐదుగురు అనుమానితులను ఐదురోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించగా.. ఈ విషయాలు తెలిశాయని పోలీసులు చెప్పారు.
కాగా.. మొబిన్, అహ్మద్ లకు ఏ సంస్థతోనూ సంబంధాలు లేవని పోలీసులు కస్టడీ రిపోర్టులో పేర్కొన్నారు. ఇద్దరు నిందితుల కస్టడీ ముగియడంతో నేడ ఎల్బీనగర్ కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇద్దరినీ చర్లపల్లి జైలుకు తరలించారు.
రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన బిల్లాపురం నాగరాజు, మర్పల్లి సమీపంలోని ఘనాపూర్ కు చెందిన సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా ఏడేళ్లు ప్రేమించుకున్నారు. ఆశ్రిన్ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో.. జనవరి 31న వీరిద్దరూ ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత హైదరాబాద్ నుంచి విశాఖపట్నం కు మకాం మార్చారు. కొన్నాళ్లకు తిరిగి హైదరాబాద్ కు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మొబిన్ నాగరాజును పథకం ప్రకారం.. నడిరోడ్డుపై హత్యచేశాడు.




Tags:    

Similar News