విషాదాంతం.. వైజాగ్ లో ఐఐటీ విద్యార్థి కార్తీక్ మృతదేహం

హైదరాబాద్ లో అదృశ్యమైన ఐఐటీ విద్యార్థి కార్తీక్ మిస్సింగ్ గురించి పోలీసులు ఆరాతీశారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేయగా

Update: 2023-07-25 03:12 GMT

హైదరాబాద్ లో అదృశ్యమైన ఐఐటీ విద్యార్థి కార్తీక్ మిస్టరీ వీడింది. విద్యార్థి కార్తీక్ మృతదేహం వైజాగ్ సముద్రం ఒడ్డున లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్ కు తరలించారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

హైదరాబాద్ లో అదృశ్యమైన ఐఐటీ విద్యార్థి కార్తీక్ మిస్సింగ్ గురించి పోలీసులు ఆరాతీశారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేయగా కార్తీక్ విశాఖకు వెళ్లినట్లుగా గుర్తించారు. జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలులో విశాఖకు వెళ్లినట్లు గుర్తించారు. విశాఖలోని ఓ బేకరీ షాప్ వుడా పార్క్ దగ్గర సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల్లో విద్యార్థి కార్తీక్ కనిపించాడు. బీచ్ రోడ్డులో కూడా తిరిగినట్లు గుర్తించారు. చివరికి వైజాగ్ సముద్రం ఒడ్డున కార్తీక్ మృతదేహం లభించింది. జులై 17న సంగారెడ్డి జిల్లాలోని కంది ఐఐటీ‌ హైదరాబాద్ హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన కార్తీక్, సోమవారం రాత్రి వైజాగ్ బీచ్‌లో శవమై కనిపించాడు. బీచ్‌లో శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఐఐటీ విద్యార్థి కార్తీక్ మృతదేహాంగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
కార్తీక్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఆరీలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో బీచ్‌లో దూకి కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టలేనంతగా డెడ్ బాడీ మారిపోయింది. కార్తీక్ సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు. కార్తీక్ ఇంజనీరింగ్ రెండో‌ సంవత్సరం చదువుతున్నాడు. అతడి స్వస్థలం నల్లగొండ జిల్లా‌ మిర్యాలగూడ మండలం పరిధిలోని ట్యాంక్ తండా కాగా.. బీటెక్ సెకండ్ ఇయర్‌లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు చెబుతున్నారు. అయితే అతడి ఆత్మహత్యకు పరీక్షల్లో ఫెయిల్ అవ్వడమే కారణమా.. లేక మరేదైనా అనే విషయం తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News