ట్రైన్ లో సీటు కోసం గొడవ.. అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు
ఈ ఘటనతో భయ భ్రాంతులకు గురైన ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్ ను నిలిపివేయగా.. నిందితుడు రైలు లో నుంచి..
రైలులో ప్రయాణిస్తోన్న ఓ ప్రయాణికుడు తన తోటి ప్రయాణికులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. కేరళలోని కోజికోడ్ రైల్వే స్టేషన్‌ను దాటి కోరాపుజ రైల్వే వంతెన వద్దకు రైలు చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అలప్పుజా – కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కిన ఇద్దరు ప్రయాణికుల మధ్య సీటు విషయంలో గొడవ జరిగింది. డీ1 కోచ్ లో గొడవ జరగ్గా.. ఆ బోగీలోనే ఉన్న కొందరు ప్రయాణికులు మహిళా ప్రయాణికురాలికి మద్దతు తెలిపారు.
దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన వ్యక్తి.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో ఆమె పక్కనే ఉన్న చిన్నారి, మరో వ్యక్తికి కూడా మంటలు అంటుకోగా ముగ్గురూ మరణించారు. ఈ ఘటనతో భయ భ్రాంతులకు గురైన ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్ ను నిలిపివేయగా.. నిందితుడు రైలు లో నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో మరో 9 మంది ప్రయాణికులకు గాయలవ్వగా.. వారందరినీ చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.