మహీంద్రా థార్ వర్సెస్ బీఎండబ్ల్యూ కార్.. వ్యక్తి ప్రాణం తీసిన రేస్

బిఎమ్‌డబ్ల్యూ కారు అతి వేగంతో తమను దాటి వెళ్ళిన తర్వాత, మరొక వాహనం వేగంగా వస్తున్నట్లు

Update: 2022-07-21 10:45 GMT

కేరళ రాష్ట్రం త్రిసూర్‌ జిల్లాలోని కొట్టెక్కాడ్ ప్రాంతంలో మహీంద్రా థార్, బీఎండబ్ల్యూ కార్ మధ్య జరిగిన రేసు కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయి. ఓ వ్యక్తి ప్రయాణిస్తున్న టాక్సీని ఎస్‌యూవీ ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. బాధితుడు, అతని కుటుంబం గురువాయూర్ నుండి తిరిగి వస్తుండగా.. గత రాత్రి 8:30 మరియు 9 గంటల మధ్య ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితుడి భార్య, కూతురు, మనవరాలు, టాక్సీ డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని వియ్యూర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. థార్, బీఎండబ్ల్యూ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నామని.. బ్లడ్ ఆల్కహాల్ పరీక్షలో మద్యం తాగినట్లు కనుగొనబడిందని అధికారి తెలిపారు.

రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు.. ఒకటి మరణానికి కారణమైనందుకు, మరొకటి గాయపడినందుకు.. విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం అకస్మాత్తుగా జరిగిందని బాధితుడి భార్య ఓ టీవీ ఛానెల్‌తో చెప్పారు. తనను ట్యాక్సీ నుంచి బయటకు తీయగా, ముందు సీట్లో కూర్చున్న తన భర్త కదలడం లేదని.. జీపు అతి వేగంతో వెళుతోందని స్థానికులు చెబుతున్నారని ఆమె తెలిపారు.
టాక్సీ డ్రైవర్ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. బిఎమ్‌డబ్ల్యూ కారు అతి వేగంతో తమను దాటి వెళ్ళిన తర్వాత, మరొక వాహనం వేగంగా వస్తున్నట్లు తెలుసుకున్నామని.. కారును రోడ్డుకు పక్కకు తరలించానని చెప్పాడు. అయినప్పటికీ, వేగంగా వచ్చిన థార్ టాక్సీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు థార్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న దృశ్యాలు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయి. ఆ ప్రాంతం నుంచి బీఎండబ్ల్యూ వేగంగా వెళ్లిపోయిందని.. అయితే ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించామని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News