వైద్యుల నిర్లక్ష్యం.. ఒకేరోజు ఇద్దరు బాలింతలు మృతి
ఇలాంటి సమయంలో ఆపరేషన్ ఎలా చేయించారని గాంధీ వైద్యులు.. సిరివెన్నెల కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం..
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో.. ఇటీవల ఆరుగురు బాలింతలు అనారోగ్యానికి గురైన ఘటన మరువక ముందే.. మలక్ పేట ప్రభుత్వాస్పత్రిలో మరో ఘటన వెలుగుచూసింది. ఒకేరోజు ఇద్దరు బాలింతలు వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందడం కలకలం రేపుతోంది. సిరివెన్నెల అనే గర్భిణీ రెండవ కాన్పు కోసం మలక్ పేట ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ఆమెకు ఎలాంటి వైద్య పరీక్షలు చేయకుండానే ఆపరేషన్ చేశారు. అనంతరం ఆమెకు తీవ్రరక్తస్రావం, బీపీ పడిపోవడం, ఈసీజీలో మార్పులు రావడంతో.. గాంధీకి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు.
గాంధీలో వైద్యులు సిరివెన్నెలకు రక్తపరీక్షలు చేసి.. డెంగ్యూ ఉన్నట్లు నిర్థారించారు. అందువల్ల ఆమె ప్లేట్ లెట్స్ పడిపోయాయని తెలిపారు. ఇలాంటి సమయంలో ఆపరేషన్ ఎలా చేయించారని గాంధీ వైద్యులు.. సిరివెన్నెల కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ కారణంగానే ఆమె మరణించినట్లు చెప్పడంతో.. కుటుంబ సభ్యులు, బంధువులు మలక్ పేట ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. మృతురాలి భర్త చాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసి, తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా.. అదే ఆస్పత్రిలో మరో బాలింత కూడా వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణించింది. ఒకేరోజు ఇద్దరు బాలింతలు మరణించడంతో.. ఆస్పత్రిలో రోగులు భయాందోళనలకు గురవుతున్నారు.