అంత గొప్ప పుల్లారెడ్డి కుటుంబంలో ఇలాంటి ఘటనా ?

సమాజం ఛీత్కరించుకునేలా వ్యవహరించాడు పుల్లారెడ్డి మనవడు ఏక్ నాథ్ రెడ్డి. భార్యను హింసించడమే కాకుండా..

Update: 2022-05-15 06:08 GMT

హైదరాబాద్ : పుల్లారెడ్డి స్వీట్స్.. ఇవి కేవలం హైదరాబాద్ లో, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. విదేశాల్లోను బాగా ఫేమస్. ఈ స్వీట్స్ ఒక్కసారి రుచి చూసిన వారు ఓ పట్టాన వదలరంటే నమ్మండి. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయే నేతి మిఠాయిలకు పుల్లారెడ్డి స్వీట్స్ పెట్టింది పేరు. కేవలం రుచికరమైన స్వీట్లు చేయడంతోనే వారికి ఇంతగొప్ప పేరు వచ్చిందనుకుంటే పొరపాటే. పుల్లారెడ్డి, ఆయన కొడుకు రాఘవరెడ్డిలు ఎన్నో సామాజిక సేవలు చేశారు. రాఘవరెడ్డి విశ్వహిందూపరిషత్ అంతర్జాతీయ ప్రెసిడెంట్ గా కూడా సేవలందించారు. అలాంటి గొప్ప పేరున్న కుటుంబానికి ఏక్ నాథ్ రెడ్డి మాయని మచ్చలా మారాడు. పెళ్లాడిన భార్యకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాల్సింది పోయి.. ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. పుల్లారెడ్డి కుటుంబంలో ఊహించని ఘటన జరిగింది. సమాజంలో ఎంతో పరపతి ఉన్న ఈ కుటుంబంలో కలహాలు రేగాయి. పోలీసుల రంగప్రవేశంతో విషయం మీడియా దృష్టికి వచ్చింది.

సమాజం ఛీత్కరించుకునేలా వ్యవహరించాడు పుల్లారెడ్డి మనవడు ఏక్ నాథ్ రెడ్డి. భార్యను హింసించడమే కాకుండా.. గదిలో నుంచి బయటికొచ్చే వీలు లేకుండా అడ్డంగా ఓ గోడ కట్టాడు. దాంతో ఆమె డయల్ 100కు ఫోన్ చేసి తనను రక్షించాలని కోరడంతో.. పోలీసులు అక్కడికి వెళ్లారు. ప్రగ్య రెడ్డి గదికి అడ్డంగా కట్టి వున్న గోడను చూసి పోలీసులు షాకయ్యారు. గదిలో నిర్బందించబడిన ప్రగ్య ను బయటికి తీసుకొచ్చారు. అనంతరం తన తండ్రితో కలిసి ప్రగ్యారెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేసింది.
 ప్రగ్యారెడ్డి ఫిర్యాదుతో ఏక్ నాథ్ రెడ్డిపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు.
పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్ రెడ్డికి ప్రగ్యా రెడ్డితో 2014, మార్చి 19న వివాహం జరిగింది. వివాహసమయంలో రూ.75 లక్షల నగదు, రూ.4.45 లక్షల విలువైన నగలు కట్నంగా ఇచ్చారు. కొన్నాళ్లకు ఏక్ నాథ్ రెడ్డి తన భార్యను అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. అదనపు కట్నం, ఒక ఫ్లాట్ ను కొని తీసుకురావాలని తనను బెదిరించినట్లు ప్రగ్యా రెడ్డి పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. అడిగిన అదనపు కట్నం ఇవ్వని కారణంగా 2021లో ఫ్యామిలీ కోర్టులో ఏక్ నాథ్ విడాకులకు అప్లై చేశాడని తెలిపింది.
తాజాగా మే 10వ తేదీన ఏక్ నాథ్ తనను పిల్లోతో నొక్కి చంపాలని ప్రయత్నించాడని, ఎలాగో అతడి నుంచి తప్పించుకున్నానని కంప్లైంట్ లో తెలిపింది. మే 12న తాను గదిలో నుంచి బయటికి రాకుండా.. మెట్లపై అడ్డంగా గోడ కట్టాడని పేర్కొంది. అతను కొంతకాలంగా ఓ వ్యాధితో బాధపడుతున్నాడని, అందుకే ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని ప్రగ్యా రెడ్డి చెప్పుకొచ్చింది. ప్రగ్యారెడ్డి ఫిర్యాదు మేరకు ఏక్ నాథ్ రెడ్డిపై సెక్షన్ 498(ఎ) (అదనపు కట్నం వేధింపులు. గృహహింస) 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. దర్యాప్తులో ఏక్ నాథ్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులు నిజమని తేలితే అతడిని అరెస్ట్ చేస్తామని చెప్పారు.


Tags:    

Similar News