రైస్ పుల్లింగ్.. చెంబు చూపించి ఇంత మోసమా!
రైస్ పుల్లింగ్.. ఈ కలశంతో గుప్త నిధులు సొంతం చేసుకోవచ్చంటూ ఎంతో మంది
రైస్ పుల్లింగ్.. ఈ కలశంతో గుప్త నిధులు సొంతం చేసుకోవచ్చంటూ ఎంతో మంది ఎన్నో రకాలుగా మోసాలకు పాల్పడుతూ ఉంటారు. ఈ మోసాల గురించి ఎప్పటికప్పుడు పోలీసులు అధికారులు చెబుతున్నా కూడా ఆగడం లేదు. తాజాగా అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లాలో రైస్ పుల్లింగ్ కలశంతో అద్భుతాలు సృష్టిస్తామని, మీ దశ-దిశ మారుస్తామని నమ్మిస్తూ మోసాలు చేస్తోంది ఓ ముఠా. సుబ్బారెడ్డి అనే వ్యక్తి రైస్ పుల్లింగ్ కలశాన్ని కొనేందుకు ప్రకాశం జిల్లా నుంచి చేర్యాలకు వచ్చాడు. 10 లక్షల 75 వేలు ఇచ్చి కలశం చూపెట్టాలని అడిగాడు. అయితే మిగిలిన డబ్బులు ఇస్తేనే చూపిస్తామన్న నిందితులు చివరికి ఇన్నోవాలో పారిపోయారు. మోసపోయానని గ్రహించిన సుబ్బారెడ్డి చేర్యాల పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.
మోసానికి పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి చెంబుతో పాటు రూ. 10.75 లక్షల నగదు, 5 సెల్ ఫోన్లు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైస్ పుల్లింగ్‌లో అద్భుత శక్తి లభిస్తుందంటూ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. పురాతన లోహ విగ్రహాలు, పాత్రలు, నాణేలను రైస్ పుల్లింగ్ ముఠా తమ మోసాలకు వాడుకుంటారు. వీటికి అయస్కాంతాన్ని రుద్దడం ద్వారా బియ్యపు గింజలను ఆకర్షించి ప్రజలను మోసగిస్తున్నారు. ఇలాంటి మోసాలకు సంబంధించిన ఘటనలు ఎన్నో ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. చాలా మంది అత్యాశకు పోయి.. ఇలాంటి కేటుగాళ్ల మాయలో పడిపోతూ ఉన్నారు.