వంతెన కిందికి దూసుకెళ్లిన టెంపో.. నలుగురి మృతి
తిరుగు ప్రయాణంలో కిన్నెరసాని వాగు సమీపంలో వాహనం అదుపుతప్పి వంతెన కిందకి దూసుకెళ్లింది. ప్రమాదంలో తీవ్రంగా..
దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా.. టెంపో రోడ్డుప్రమాదానికి గురవ్వడంతో నలుగురు ఏపీ వాసులు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఏపీలోని ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన ఆరుగురు పెద్దలు, ఆరుగురు పిల్లలు టెంపో వాహనంలో భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు.
తిరుగుప్రయాణంలో కిన్నెరసాని వాగు సమీపంలో వాహనం అదుపుతప్పి వంతెన కిందకి దూసుకెళ్లింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దుర్గారావు (40), శ్రీనివాసరావు (35)ను బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. నలుగురు చిన్నారులకు గాయాలు కాగా వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రదీప్ (10), సందీప (12) లు మృతి చెందారు. మిగతా వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బూర్గంపాడు పోలీసులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.