విశాఖలో రౌడీ షీటర్ హత్య
రెండేళ్ల క్రితం విశాఖ నగర పోలీస్ అధికారులు కన్నబాబును నగరం నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం అతను అనకాపల్లిలోని గాంధీనగర్..
విశాఖ జిల్లాలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. అనకాపల్లి జిల్లా రాజాన కన్నబాబు అనే రౌడీ షీటర్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. అనకాపల్లి మండలం ఊడేరు రహదారి సమీపంలో కన్నబాబు రక్తపుమడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. పాతకక్షల నేపథ్యంలో కన్నబాబును హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా కన్నబాబుపై విశాఖ పట్నం పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ నమోదు అయ్యింది.
రెండేళ్ల క్రితం విశాఖ నగర పోలీస్ అధికారులు కన్నబాబును నగరం నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం అతను అనకాపల్లిలోని గాంధీనగర్ లో తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. కన్నబాబు ఉమ్మడి విశాఖ జిల్లాలో భూ దందాలు, సెటిల్ మెంట్లు, కిడ్నాప్ లు, పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, కన్నబాబు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కాగా.. బుధవారమే విశాఖ పోలీసులు నగరంలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వగా.. మరుసటిరోజే రౌడీషీటర్ హత్యకు గురవ్వడం కలకలం రేపింది.