ఒంటరి మహిళలూ.. సైకోగాళ్లున్నారు జాగ్రత్త
ఒంటరిగా ఉండే మహిళలు జాగ్రత్తగా ఉండటం మంచిది
ఒంటరిగా ఉండే మహిళలు జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా వృద్ధ మహిళలు డబ్బుకు ఆశపడి ఇళ్లను తెలియని వారికి అద్దెలకు ఇవ్వవద్దని పోలీసులుసూచిస్తున్నారు. ఇటీవల సైకోగాళ్లు పెరిగిపోతున్నారు. వృద్ధురాలు అని కనికరం లేకుండా కూడా హత మార్చి తమలోని శాడిజాన్ని చూపించడం ఇటీవల కాలంలో ఎక్కువయింది. అవసరాలు పెరిగిపోవడం, మత్తు కోసం కొందరు.. అంటే గంజాయి, డ్రగ్స్ కోసం డబ్బులు అవసరమై కొందరు, మద్యం తాగడానికి, విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి మహిళలను చంపడానికి కూడా వెనుకాడని ఫాల్తు గాళ్లు ఇటీవల కాలంలో పెరిగిపోయారు. తాజాగా కుషాయిగూడలో ఒక ఇంట్లో అద్దెకు ఉండే యువకుడు కమలాదేవి అనే వృద్ధమహిళలు చంపేసి పారిపోయాడు.
అద్దెకు ఇవ్వడంతో...
కమలాదేవి చేసిన తప్పు ఏంటంటే.. తన ఇల్లు కుషాయిగూడ మెయిన్ రోడ్డుపైనే ఉంటుంది. నాలుగు షాపులు, ఇల్లు ఉన్న ఆమె ఒక గదిలో తాను ఉంటూ షాపులతో పాటు మరో గదిని యువకుడికి అద్దెకు ఇచ్చింది. షాపులో పనిచేసే కుర్రాడే ఆ గదిలో అద్దెకు ఉంటున్నాడు. అయితే అద్దె డబ్బులు అడిగిందని, తన విలాసాలకు అవసరమైన డబ్బులు కావాల్సి రావడంతో ఆ సైకోగాడు కమలాదేవిని చంపేందుకు ప్లాన్ వేశాడు. ఒంటరిగా ఉన్న కమలాదేవిని హత్య చేశాడు. చంపిన తర్వాత రెండు చేతులను తాళ్లతో కట్టేసి వేలాడదీసి అందిన బంగారాన్ని, డబ్బును దోచుకుని వెళ్లాడు. కమలాదేవి తన కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరిగా ఉండటంతో ఆమెను సులువుగా ఈ శాడిస్ట్ హత్య చేశాడు.
డెడ్ బాడీ వద్ద డ్యాన్స్ చేసి...
హత్యచేయడమే కాకుండా చంపుతున్న దృశ్యాలను వీడియో తీశాడు. కమలాదేవిని హత్య చేయడమే కాకుండా డెడ్ బాడీ వద్ద డ్యాన్స్ కూడా చేశాడు. తీసిన వీడియోలను బెంగళూరులోని తన స్నేహితులకు పంపాడు. బెంగళూరులోని ఈ సైకోగాడి ఫ్రెండ్స్ ఆ వీడియోలను వైరల్ చేయడంతో కమలాదేవి హత్య బాహ్య ప్రపంచానికి తెలిసి వచ్చింది. గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి కమలా దేవి హత్య జరిగినట్లు నిర్ధారించారు. హత్య చేసి పారిపోయిన యువకుడి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. సో.. ఒంటరిగా ఉన్న మహిళలూ అపరిచిత వ్యక్తులకు డబ్బుకు ఆశపడి ఇళ్లను అద్దెకు ఇవ్వవద్దని పోలీసులు సూచిస్తున్నారు.