మొబైల్ ఫోన్ కొనివ్వలేదని తల్లిని చంపిన కొడుకు..!

కర్ణాటక పోలీసులు శనివారం 26 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. మైలసంద్రలోని లూకాస్‌ లేఅవుట్‌లో

Update: 2022-06-04 09:49 GMT

మొబైల్ ఫోన్ కొనివ్వలేదని తల్లిని హతమార్చాడో కొడుకు. కర్ణాటక పోలీసులు శనివారం 26 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. మైలసంద్రలోని లూకాస్‌ లేఅవుట్‌లో నివాసం ఉంటున్న దీపక్‌ను అరెస్టు చేశారు. జూన్ 1న దీపక్ తన తల్లి ఫాతిమా మేరీ (50)ని గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి సోదరి జాయిస్ మేరీ తన తల్లి ఇంట్లో లేకపోవడంపై ఫిర్యాదు చేసింది.

ఫాతిమా మేరీ ఆకుకూరలు అమ్మి కుటుంబాన్ని పోషించేది. ఆమె వయసు 50 సంవత్సరాలు. తమిళనాడుకు చెందిన ఆమె 20 ఏళ్ల క్రితం బొమ్మనహళ్లి సమీపంలోని బేగూరికి వచ్చింది. ఐదేళ్ల క్రితం లూకాస్ లేఅవుట్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆమె భర్త అనారోగ్యంతో ఉన్నాడు. 28 ఏళ్ల కుమారుడు దీపక్‌కు ఫిట్స్‌ ఉన్నాయి. కుమార్తె జాయిస్ మేరీకి రెండేళ్ల క్రితం వివాహమై తల్లి వద్దే ఉంటోంది. మడివాల మార్కెట్‌లోవ్యాపారం చేస్తూ ఉండేవారు. కానీ ఆమె మరణంతో కుటుంబం మొత్తం వీధిన పడింది.
కొడుకు దీపక్ మొబైల్ డిస్ ప్లే మూడు నెలల క్రితం చెడిపోయింది. అప్పటి నుంచి కొత్త మొబైల్ కొనివ్వాలని తల్లిని అడుగుతూ ఉండేవాడు. కానీ తల్లి మాత్రం కొన్ని రోజులు ఆగమని చెప్పింది. జూన్ 1న ఎప్పటిలాగే ఫాతిమా మేరీ ఆకుకూరలు కోయడానికి పొలానికి వెళ్ళింది. జాయిస్ మేరీ తన సోదరుడిని పొలం నుండి తన తల్లిని తీసుకురావాలని కోరింది. దీపక్‌ తన తల్లి రోడ్డు పక్కన చనిపోయిందని తండ్రి ఆరోగ్యస్వామికి సమాచారం ఇచ్చాడు. పోలీసులు చేరుకొని విచారణ మొదలుపెట్టారు. అనుమానితుడిగా ఉన్న ఆమె కుమారుడిని పోలీసులు విచారించగా.. దీపక్ తన తల్లిని హత్య చేసినట్లు అంగీకరించాడు.
దీపక్ తన తల్లిని కలిసిన తర్వాత ఫోన్ కొనివ్వమని మరోసారి అడిగాడని పోలీసులు తెలిపారు. ఆమె మరోసారి కుదరదని చెప్పడంతో దీపక్ ఆవేశంతో చీరతో ఆమె గొంతుకోసి చంపారు. హత్య చేసిన తర్వాత నిందితుడు ఆమె వద్ద నుంచి రూ.700 అపహరించి అక్కడి నుంచి పారిపోయాడు.


Similar News